"మాయ బుందీని నాశన మొనర్చి ఒకటి నిజమైన బుందీని దహించిన ఒకటియా? మీ సర్వశక్తులతో రాణాను ఎదుర్కొనుటకు సిద్ధము కండు. మన జాతి ప్రతిష్ఠ దేశ గౌరవము నిలువ బెట్టుడు" అని బెర్సీ తన హారాశాఖీయులను ఉద్బోధించెను.
"బొమ్మ బుందీ కట్టిన మట్టికైనను అవమానము జరుగరాదు. బైర్సీ! ఈ పోరాటమున మాకు నాయకత్వము వహింపుము. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు నడిపింపుము" అని హారాశాఖీయులు బైర్సీని వేడిరి.
నాయకత్వము వహించుటకు బైర్సీ అంగీకరించెను. 'జై! బైర్సీకి జై!' జై! బుందీకి జై!' అను వీర నినాదములు మిన్ను ముట్టెను.
చిత్తూరు రాణా తన దుర్గమునుండి కొలది సైన్యముతో బయలుదేరి మాయబుందీని నాశనముచేయ వచ్చెను. అతడు బొమ్మబుందీ యందు హుళక్కి పోరాటము జరుగును అని తలచెను.
యుద్ధమర్యాదను బట్టి ముందు ఒకనిని "దుర్గమును మాకు స్వాధీనము చేయుడు. లేకున్న నేలమట్టము కావింతును" అని కోటలోని వారితో చెప్పుటకు పంపెను.
అతనితో మాయబుందీ రక్షకులు "మేము మా ప్రాణములు ఉండగా మా దుర్గమును రాణాకు స్వాధీనము చేయుము. ఆయనకు శక్తి ఉన్న పోరాడుటకు సిద్ధపడి రమ్మనుము" అని వార్త పంపిరి.
ఈ వార్త విని రాణా అదియును మంత్రులు ఏర్పాటు చేసిన దానిలో భాగము అని తలచెను. రాణా ముట్టడిని ఆరంభించి తుపాకులను దుర్గము పైకి పేల్పించెను. రాణా వారికి సమాధానముగా గుండ్లు లేని తుపాకులు ప్రేలునని అనుకొనెను.
బైర్సీ సైన్యము మాయబుందీ దుర్గమును కాపాడుచు గుండ్లు గల తుపాకులను ప్రేల్చిరి. ఈ విషయమును చూచి మంత్రులను రాణాయును ఆశ్చర్యపడిరి. విషయము ఏమో తెలిసికొని రావలసినది అని ఒకనిని బుందీ దుర్గములోనికి పంపిరి.
అతడు దుర్గములోనికి ప్రవేశించి హారాశాఖీయుల నాయకుడైన బైర్సీని కలిసెను. “మీ ఎదుర్కోలు అపూర్వముగ ఉన్నది. దీనికి కారణము ఏమి?" అని ప్రశ్నించెను.
హారాశాఖీయుల నాయకుడు “బుందీ మా జన్మదేశపు దుర్గము. మాలో కొన ఊపిరి ఉన్నంతవరకును బుందీ రాణాకు చిక్కదు. ఈ వార్తను రాణాకు ఎరిగి౦పుము” అని అతని ప్రశ్నకు సమాధానము చెప్పెను.