Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/908

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వరకు ఆ కోట చిత్తూరు సైన్యమునకు చేజిక్కదు. మంత్రులు రాణా ప్రాణములను కాపాడుటకు ఒక ఉపాయమును ఆలోచించిరి.

“బుందీని పోలిన దుర్గమును ఒకదాని చిత్తూరుకోట బయట నిర్మింతుము. ప్రభువు దానిపై దండెత్తి పట్టుకొని దహించి నేలమట్టము చేయును. ప్రభువు ప్రతిజ్ఞ నెరవేరును. వారి ప్రాణములు దక్కును. తరువాత బుందీ పైకి పోయిన సైన్యము దానిని జయించి వచ్చి ప్రభువుకు ఆ వార్త చెప్పెదరు” అని చిత్తూరు మంత్రులు నిశ్చయించిరి.

చిత్తూరు దుర్గమునకు బయట బుందీకోటను పోలిన కోటను నిర్మించుట ప్రారంభించిరి. ఈ మాయబుందీ దుర్గమున బాటలు, తోటలు, సౌధములు, కోటగోడలు, బురుజులు అన్నియును నిజమైన బుందీ దుర్గమునకు ఉన్నట్లు ఏర్పరచిరి. మాయ బుందీ నిర్మాణము పూర్తియైనది. ప్రాయోపవేశము చేయుచున్న రాణాకు మంత్రులు ఈ పన్నుగడను తెల్పిరి. అతడు కొలది కాలములో అల్పసైన్యముతో వచ్చి మాయబుందీ దుర్గమును పట్టుకొనుటకు అంగీకరించెను.

చిత్తూరు రాణాకడ హారాశాఖవారు కొందరు ఉద్యోగములు చేయుచుండిరి. వారి జన్మస్థానము బుందీ వారికి నాయకుడు కూంబీ బైర్సీ.

బైర్సీ కొండజాతివాడు. ఇతనికి ఇతని శాఖవారికిని జంతువులను వేటాడుట అన మిక్కిలి ఇష్టము. మాయబుందీ పూర్తియగు వేళకు బైర్సీ లేళ్ళ వేట నుండి తిరిగి వచ్చెను. వచ్చినపుడు చిత్తూరునకు బైట నిర్మింపబడిన బుందీ దుర్గము అతని కంటబడినది. దానిని అక్కడ ఎందుకు కట్టిరో మొదట అతనికి అర్థము కాలేదు.

విచారించిన పిమ్మట "చిత్తూరు రాణా దానిపై దండెత్తి దానిని దహించి నేల మట్టము చేయును” అని అతనికి తెలిసినది. మరు క్షణమున అతనిలోని దేశాభిమానము పొంగి పొరలినది. ఉద్రేకముతో "రాణా బుందీని పట్టి దహించి నేలమట్టము చేసికొని భుజింపడట! నా జన్మదేశపు దుర్గము ఎట్లు పతనము అగునో, దానిని రాణా ఎట్లు నాశనమొనర్చునో చూచెదను" అని బైర్సీ మనస్సున తలపోసెను.

బైర్సీ చిత్తూరులో ఉన్న హారాశాఖీయులను అందరను ఒక ఏకాంత ప్రదేశమున సమావేశమొనర్చెను. అతడు వారికి జన్మదేశమగు బుందీకి కలుగనున్న అవమానమును గూర్చి తెలియచెప్పెను.