కుమారుఁడు మిత్రునితోననినమాటలకు సునీథా దేవి హృదయము కలతనొందినది. ఆమె వచ్చిన బాలకుఁడు ధనిక కుటుంబమునకు జెందినవాఁడని గ్రహించినది. సాయశక్తుల నాతని సంతోషపెట్ట మనమున నిశ్చయించుకొనినది.
“మా మంగళుఁడు పేదఱికమునకు సిగ్గుపడుచున్నట్లున్నాడు. అదియొక దోషము కాదని గుర్తించినట్లు లేదు. నాయనా శిఖీ! మాయింట నెట్టిలోపములున్నను నీవు లెక్క పెట్టవద్దు".
"అమ్మా! మంగళుఁడు నాకు సోదర ప్రాయుడు. అతని గృహము నా గృహమే”యని ప్రియపూర్వకముగ శాతకర్ణి ప్రత్యుత్తరమిచ్చెను.
ఏకాంతమున తల్లితో 'అమ్మా! మనము పేదవారమని యంగీకరించుట నీకంతరోష మెందుకు? అని కోపముతో బలికినాడు.
'మంగళా! మన నిర్భాగ్య ప్రశంసయొనర్చినవాడవు నీవే కదా! పేదఱికము భగవదేచ్ఛ. ఈ విషయమును నీవేనాటికైన గ్రహింతువు. దానివలన కొన్ని సుగుణములబ్బును. సౌఖ్యము లభించును. దాని గుర్తించుటకు జ్ఞాననేత్ర మవసర'మని సునీథాదేవి కుమారునకు బుద్ధులు చెప్పినది.
ఈ ప్రసంగము శాతకర్ణి చెవులబడినది. నాలంద జీవితమున మంగళు ఁడెంతమంచివాడు! ఇంటియొద్ద నతఁడిట్లు ప్రవర్తించునని శిఖిమున్నెన్నడు నూహింప లేదు. గౌరవ ప్రేమల బ్రకటించి పూజింపవలసిన మాతృదేవతను మిత్రుడు మాటిమాటికి దిరస్కరించుట యతనికి నచ్చలేదు. అతఁడాశ్చర్యపడినాడు.
విభేదభావములేక కుమారునకు, శాతకర్ణికి నన్నపానముల జేకూర్చియిచ్చిన సునీథా దేవిపై నతనికి గౌరవభావమేర్పడినది. ఆమె యౌదార్యము నిరుపమానమైనది. ఆమె ముఖము శాంతిదేవతకు నిలయము. ఆమె సదాచారపుంజము.
మిత్రుడు మంగళునితో సునీథాదేవి యున్నతిని బ్రశంసించినాడు. వ్యంగ్య గర్భితముగ నామెను గౌరవింపుమని యాదేశించినాడు.
'మంగళా! మీయింట నివసించుట నాకు మహానందమును గల్గించినది. మీ మాతృదేవత చూపించిన యనురాగమునకు నేను ముగ్ధుడనైనాను. నీవామెను గౌరవింప నింకను నేర్చుకొనవలసి యున్నది”.