చివర వాక్యమును వినిపించుకొననట్లు ప్రవర్తించి "శాతకర్ణి! నీ వాక్యము వినుటకు నాకెంతో సంతోషముగ నున్నది. ఈ గ్రామమున నొక కుటీరములో నిరంతరము నివసింప వలసివచ్చిన నీవంగీకరింతువా?
"నిశ్చయముగ దాని నొక సౌఖ్యభూమిగా నొనర్పయత్నింతును”.
"అప్పుడు నీయత్నము కేవలము మృణ్మయమును ముద్దజేసి స్వర్ణపిండమని భావించుటయే యగును".
మిత్రునికి సౌఖ్య స్వరూప మెట్టిదో యర్థము కాలేదు. అందుకు గొంతకాలము పట్టునని తలపోసి శాతకర్ణి సంభాషణమును మరియొక నూతనాంశమునకు మార్చినాడు.
పది దినములు సంతోషముతో గడచినవి. సునీథాదేవి యాశీర్వాదముతో మిత్రులిరువును మఱల నాలందకు బయనమైనారు.
9
సకాలమునకు నాలంద జేరుకొనవలెనని మిత్రులిరువురును నిశ్చయించుకొని బయలు దేరినారు. కాని మార్గమధ్యమున గొన్ని చారిత్రాత్మక ప్రదేశములున్నవి. వానిలో రాజగృహమతి ముఖ్యమైనది. దానిని దర్శించుటకొక దినము పట్టినది. మూడుదినము లాలస్యముగ జేరుకొనినారు.
వారి నాహ్వానింప నుత్తరద్వారముకడ సుజాతుడు, బ్రహ్మాయువు కొంతదూర మెదురు వచ్చినారు. ధ్వజకేతువు, గుణస్వామి ద్వారముదగ్గఱ నున్న తోరణ శిల్పఖండముల బరిశీలించుచు వారి కొఱకు నిలచియున్నారు.
ఆచార్యులు, నుపాధ్యాయులు తిరిగి వచ్చిన విద్యార్థుల యోగక్షేమముల, వారి తల్లిదండ్రుల మంచిచెడ్డల సంభాషించినారు. గృహపరిసరములు, వారి బంధు, మిత్ర, స్వరూప స్వభావములు విద్యార్థుల భావనావీథులనుండి యింకను దొలగి పోలేదు. ఇంటి నుండి నూతనోత్సాహముతో, నవానందముతో, నూతనాశయ లక్ష్యములతో వారు తిరిగి నూతన వ్యక్తులవలె వచ్చినారు.
నాలంద నివాసకక్ష్యలలో మార్పువచ్చినది. నేడు శిఖిశాతకర్ణి ఆచార్య కాశ్యపుని ప్రత్యేక మందిరమున నుండి కొంతకాలమాయనకు బరిచర్య యొనర్పవలసియున్నది. మంగళుఁడు వినయవిహారమున ద్వితీయ కక్ష్యలో నివసింపవలెను. కంటక విహారమున