చిన్నబుచ్చుకొనినాడు. శాతకర్ణి "మిత్రుఁడా! నీ వింతటి వ్యర్థుడవనుకొనలేదని శిఖి గర్భితముగ ననివాడు.
మంగళుని ఖరరథమును జూచినంతనే ఏకశృంగునికి గడుపుబ్బ నవ్వువచ్చినది. ఎప్పుడు తిరిగివచ్చి మిత్రులజేరి యాఖరరథమును వర్ణించి యేడ్పించుదునా యని యతఁడుబలాట పడినాడు.
'అదిగో! దూరముగ నావనమునకు వెనుక నున్నదే మా గ్రామము. అంత నిష్ప్రయోజనమైనది మరి యీ దేశమున నెచ్చటను గన్పింపదు. చూచిన పగలు మండిపోవుచున్నట్లుండునని మంగళుఁడు స్వగ్రామమును గుఱించి శాతకర్ణికి జెప్పినాడు.
"ఏమైననది నీకు జన్మభూమి గదా! అట నివాసమున నీకు సంతోషముండక తప్పు'దని శాతకర్ణియనినాడు. రాచబాట గడచి రథము డొంకబట్టినది. కొలది దినముల క్రితమే మూడు నాల్గు దుక్కుల వర్షము పడుటచే దారియంతయు బురదగ నున్నది. ఖరములు లాగలేకున్నవి. "మంగళా! వాటిని బాధపెట్టుటకంటె నీ కొంచెము దూరమును మనము నడుచుట మంచిది గదా" యనినాడు.
ముందు మిత్రులిరువురును నడచుచున్నారు. వెనుక రథము వారి మూటలతో వచ్చుచున్నది.
ఖరరథముతో వారిరువురు మంగళుని కుటీర ద్వారముకడ నాగినారు. పిలుపువిని యతని తల్లి సునీథాదేవి కాళ్ళకు నీళ్లుదీసికొని వచ్చినది. పాదప్రక్షాళన మొనర్చి మంగళుఁడు, శాతకర్ణితో నింటిలో బ్రవేశించినాడు.
"ఇతడు నా మిత్రుడు శాతకర్ణి" అని శిఖిని తల్లికి బరిచయము జేసినాడు. 'శిఖీ! మేము పేదవారమని నీకీపాటి కర్ధమైయుండును. మా యింట సేవకులుండరు. మూటలు లోపల తెచ్చి పెట్టెదను. కొంచెము విశ్రమింపు'మని యరుగుపై బరచియున్న చిరిచాప జూపించినాడు. 'నేనును నీకు సాయమొనర్తునని శాతకర్ణి వెంట బయలుదేరినాడు.
సర్దుకొనుట పూర్తియైనది.