బట్ట భద్రులొనర్చినారు. ఆచార్యులు స్నాతకోపన్యాసమొనరించిన పిమ్మట సభ ముగిసినది.
మఱుసటి దిన ముదయమైనది. విద్యార్థులు స్వగ్రామముల కేగుచున్నారు. నాలంద నాల్గుద్వారముల కడ జనసమ్మర్దము విస్తారముగ నున్నది. కుమారుల గొనిపోవ కొందఱు తండ్రులు విచ్చేసినారు. అనాథ బాలురు నలందలోనే యాచార్యుల యొద్ద నివసించుట కేర్పాటు జరిగినది.
శిఖి సెలవులలో నింటికేగక నమృతవర్షునికడ బ్రత్యేక పాఠముల జదువుకొన దలచినాడు. కాని మంగళుఁడతనిని 'పదిదినముల సెలవులు మాయింట గడుపుదువు రమ్మని యాహ్వానించినాడు. మిత్రునకు గోపమువచ్చునేమో యని యతఁడంగీకరించినాడు.
"మంగళా! నీమాటను దీసివేయలేక వచ్చుటయే. కాని నాకు నాలందలోనే యీ కాలము గడుపవలెనని యున్నది.”
"మఱుసటి సెలవుల కట్లే చేయవచ్చును. నన్ను తృప్తిపఱచుటకై నీవంగీకరించినందుకు సంతోషము.”
విద్యార్థులందఱును వెళ్ళిపోయిన తరువాత మంగళుఁడు శాతకర్ణితో స్వగ్రామమునకు బయనమైనాడు. అతడు దరిద్రుఁడు. ఆ కారణమున వారు ఖరరథముపై బ్రయాణ మొనర్ప వలసి వచ్చినది. అతడు నిర్దనుడని గ్రహించిన నేమనుకొందురోయని యతనికి జెప్పరాని యభిమానము.
'మన రథము నెవ్వరును జూచుట లేదు గద? యని మంగళుడు శాతకర్ణిని బ్రశ్నించినాడు.
"జూచిన వచ్చు లోపమేమున్నది? అందుకింత తత్తరపడెదవేల? యని యతడు బలికినాడు.
రథము కొంతదూరము సాగినది.
వెనుక నొక 'మృగరథము' వచ్చుచున్నది. 'శిఖీ! మనబ్రతుకు బయటపడినది. అదిగో! ఏకశృంగుని మృగరథము. వానినోట నువ్వుగింజయు దాగదు. తిరిగి వచ్చిన తరువాత నా ధనమదాంధుడు నలువురకు జెప్పి నన్నేడ్పించును.' అని మంగళుఁడు