"ధ్వజకేతుని సంతోష పరచినట్లు శాతకర్ణిని విద్యార్థులెవరు నుత్సాహ పరచుట లేదు. నిజముగ నతడేమేటిమల్లు"డని అమృతవర్హోపాధ్యాయుడు ప్రక్కనకూరుచున్న కామాయిని భిక్కునితో ననినాడు.
"దీనికంతటికి వెనుకటి యాతని దుష్కృత్యమే కారణమైయుండు"నని యామె పలికినది.
ఆమె వాక్యము రంగస్థలమున నున్న శాతకర్ణి చెవులబడినది. ఒకమారు దీనముగ విద్యార్థుల నందఱజూచినాడు. వారు గేలిచేసినారు. అతనికి దుఃఖము వెల్లివిరిసి వచ్చినది. సహింపలేక జనమధ్యమున బ్రవేశించినాడు.
'శాతకర్ణి పోరాటమును జాలించి బయటకు వెళ్ళిపోవుచున్నాడు.'
“వెడలి పోవుటలో నాశ్చర్యమేమున్నది? మనము మూర్ఖులవలె వ్యవహరించి యతనిని గేలిచేసినాము. నిరుత్సాహ పడినట్లున్నాడు”.
"అతడే మేటి మల్లుడు. అతనిచే పోరాడింపవలసినదే. మన కుత్సితము నతడు గ్రహించినాడు. మఱల రంగస్థలమును ప్రవేశింపడేమో!" - అను వాక్యములు విద్యార్థుల నుండి వినిపించుచున్నవి.
మంగళుడు శాతకర్ణి దగ్గఱకు వచ్చి 'ఈ దుష్టులతో నీకేమి! ధైర్యము వహించి పోరాడి బహుమానమును బొందుము అనిచెప్పినాడు. శాతకర్ణి! నీవు మల్లరంగమును వీడి పోవల'దని యుత్సాహముతో నమితాభుడు ప్రోత్సహించినాడు. శిఖి యామాటల లెక్కపెట్టక గుంపులోనికి వెళ్ళిపోవుచున్నాడు.
కార్యకర్త బ్రహ్మాయువు 'ధ్వజకేతూ! నీవు గెలిచినట్లు విద్యార్థులకెరుక పరతు ననినాడు. అందులు కతడంగీకరింపలేదు.
'శిఖీ! ఈ పని యేమియు బాగుగ లేదు. నన్నవమానింపదలచినావా? యని కేక పెట్టినాడు. మిత్రునిమాట యతని చెవినిబడినది. కపోలముపై జారుచున్న కన్నీటి బిందువుల దుడుచుకొనుచు దగ్గఱకు వచ్చి 'మిత్రమా! ధ్వజకేతూ! నన్నెందుకు పరీక్షించెదవు? నా మానసికస్థితి యనుకూలముగ లేదు' అనినాడు.
'నీవు పోరాడి బహుమానము పొందక తప్పదు. లేకున్న నన్నవమానింప దలచినట్లు భావింతును. అరుగో! నిన్నుత్సాహపరుప గయా శీర్షపాధ్యాయులు రంగస్థలమునకు వచ్చుచున్నారని ధ్వజకేతువు పలికినాడు.