“ఆ దుష్టుల గురించి నీవాలోచింపవద్దు. నీవు బాల్గొనకున్న నేనును బాల్గొనను”.
"సోదరా! నన్ను బలవంత పెట్టవద్దు. నాకేమో సిగ్గుగ నున్నది.”
"శిఖీ! నా మాట వినవా? తప్పదు. లెమ్ము! రంగస్థలమున బ్రవేశింప సిద్ధపడుమని జెప్పిన ధ్వజకేతు”వతనిని క్రీడాభూమికి గొనిపోయినాడు.
కార్యకర్త బ్రహ్మాయువు 'బలప్రదర్శనమున బాల్గొనువారు పదిమందియేనా?’ యని ప్రశ్నించి ధ్వజకేతువు, శాతకర్ణుల వైపు చూచినాడు. 'మేమిరువురమును బాల్గొందుము' అని ధ్వజకేతువు వారి నామముల బ్రహ్మాయువునకు జెప్పి పత్రము వ్రాయించినాడు.
వారిరువురును మల్ల విద్యాప్రదర్శనకు యోగ్యమైన రూపములతో రంగస్థలమును బ్రవేశించినారు. విద్యార్థుల దృష్టి నాకర్షించి, సమయమునకై వేచియున్నారు.
ప్రదర్శనములు కొన్నిసాగినవి. చిల్లర విద్యార్థుల నందఱనేకశృంగు డోడించినాడు. నేడు రంగస్థలమున నలువురు మాత్రమే యున్నారు. ఏకశృంగుడు, కాత్యాయనుడు, ధ్వజకేతువు, శాతకర్ణి.
కాత్యాయనుడు ఏకశృంగునోడించినాడు. తరువాత కాత్యాయనుడు ధ్వజకేతువుతో పోరాడి యోడిపోయినాడు. ఇక నిలిచిన వారిరువురు మాత్రమే - ధ్వజకేతువు. శాతకర్ణి.
ధ్వజకేతువు పొడగిరి. శాతకర్ణి యించుక కురచ. కాని యతడు కాయపుష్టిగలవాడు. ఇరువురిలో నెవరికి విజయము చేకూరునో ముందు నిర్ణయించుట కవకాశము లేదు. శాతకర్ణి గెలుచుననియన్న నేమి ప్రమాదము జేకూరునో యని యెవ్వరు నతని పేరు బయటికి జెప్పుటలేదు.
ధ్వజకేతువు పోరాటమున మల్లబంధ ప్రావీణ్యమును జూపినపుడెల్ల - విద్యార్థులు సంతోష సూచకముగ గరతాళ ధ్వనులొనర్చు చున్నారు. అతనిచెవులలో నుత్సాహ వాక్యములు రింగుమని మార్మోగుచున్నవి. అతనికంటె నధిక నైపుణ్యమును శాతకర్ణి బ్రకటించి తప్పుకొని నపుడొక్కరును బలుకరు, అంతటితో నూరకున్నజాలును, గేలిచేసి వారతని నేడ్పించుచున్నారు. వారిమనస్తత్వమునకు ధ్వజకేతువునొచ్చుకొని యొకటి రెండుమారులు తానే శిఖిని బహిరంగముగ మెచ్చుకొనినాడు