ఆ తండ్రికి నూతన పరిణామముతో దొణికిసలాడుచున్న శిఖిశాతకర్ణి యెడ నమ్మకము, నవ్యానురాగము జనించినది.
5
గయాశీర్షుని గ్రంథజాల మగ్నిదగ్ధ మొనర్చుటవలన శిఖిశాతకర్ణి మంచిపేరు కొంతకాలము మరుగుపడినది. తిరిగి దానిని సంపాదించుకొన ధైర్యముతో నతడు విశ్వ ప్రయత్నము లొనర్చుచున్నాడు.
విజితావి, యతని బృందము నేడు శిఖితో మాటాడుట లేదు. అతడు కనుపించిన బ్రక్కకు దప్పుకొని పోవుచున్నారు. ఉదాత్తులు, ఉత్తములు నగు బ్రహ్మాయువు, గుణస్వామి యతనికి నూతన మిత్రులైనారు. వారి సుస్నేహమువలన మఱల శిఖిశాతకర్ణి యుత్తమ బాలుడనిపించుకొనుచున్నాడు. దానికతడు గ్రంథభాండారమున నొనర్చుచున్న విశేషకృషి, బలవిద్యాప్రదర్శనములు సహకారులైనవి.
బుద్ధ జయంత్యుత్సవములలో విద్యార్థుల సమస్త ప్రజ్ఞా విశేషములను బరిశీలించి వారికి బహుమానములొసగు టాచారము. కొన్ని ప్రదర్శనములు జరిగినవి, మరికొన్ని జరుగవలసియున్నవి.
క్రీడాభూమి యంతయును జనసమ్మర్దముతో కళకళలాడుచున్నది. ఆచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి స్థానముల బలవిద్యా ప్రదర్శనమును జూచుటకై రంగ స్థలమునకు నాలుగు దిక్కుల గూర్చొనినారు.
“నీ విందులో బాల్గొనకదప్పదు. బహుమతి నీదే”నని ధ్వజకేతువు శాతకర్ణిని హెచ్చరించినాడు. "నీవు పాల్గొనుము. 'ఎందుకో నాకందు బ్రవేశింపనిష్టములేదని శాతకర్ణి యతనితోననినాడు. 'ఇతరులందఱును నన్ను బహిష్కరించినారు. ఇందరిలో నన్ను బలుకరించి నీ మంచి పేరును జెడగొట్టుకొనకుమని' భిన్న ముఖముతో నతడు బలికిన వాక్యము ధ్వజకేతును గలతపెట్టినది.
ఉఫ్. నీతో మాటాడక వారొక యుత్తమ మిత్రుని గోల్పోవుచున్నారు. నేను నా హృదయము చెప్పు నల్లొనర్చువాడను. ఇతరుల జూచి వెరచి సత్యము నాచరింప భయపడను. శిఖీ! ఈ ప్రదర్శనమున నీవు బ్రవేశింపకదప్పదని ధ్వజకేతువతని నిర్బంధించినాడు.
“విద్యార్థులందఱును నన్ను గేలిచేతురని భయపడుచున్నాను.”