Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతనిని లేవదీసి గయా శీర్షుడిట్లు వాగమృతమును వర్షించినాడు. “లెమ్ము! నాయనా శిఖీ! లెమ్ము! నిన్ను నేను హృదయపూర్వకముగ క్షమించినాను! నీ వొనర్చిన దాని వలన నేను నొక గుణపాఠమును నేర్చుకొనినాను. నీవు నొక పాఠమును నేర్చుకొంటివి. నా వయస్సు వచ్చునాటికి నీవు సమస్త క్రోధమును జయించి భగవానుని యిచ్ఛనెరిగి వర్తింతువని నేను నమ్ముచున్నాను. నీ తప్పిదమును సరిదిద్దుట కేమైన నొనర్చుటకు సిద్ధముగ నున్నాననినావు. నీ కృషివలన నాకు గలిగిన నష్టము తీరునది కాదు. నీ వుత్తమ విద్యార్థి వనిపించుకొనిన నాకదియే పదివేలు”.

ఉపాధ్యాయుని ప్రశాంత మధుర కంఠములో నౌదార్యము వెల్లువలై పారినది. "హృదయ పూర్వకముగ నిన్ను నేను క్షమించినా” నన్న వాక్యము శాతకర్ణి యంతరాంతరముల హత్తుకొనినది. అతడు కన్నీటితో కృతజ్ఞతను వెల్లడించినాడు.

'శిఖీ! నీవిక స్వేచ్చగ వర్తింపుము. పూజావేళయైనట్లున్నది. చైత్యగృహమున కిరువురమును గలసిపోదమురమ్మని యతని భుజముపై శీతలహస్తముంచి గయా శీర్షుడు నడిపించుకొని పోవుచున్నాడు. త్రోవలో విద్యార్థులు బారులు దీర్చి నిలువబడి నమస్కరించుచు నుపాధ్యాయునియెడ గౌరవమును బ్రదర్శించుచున్నారు. ఆ దృశ్యమువలన నాలందా విద్యార్థులకు క్షమయెంతటి మహత్తర శక్తియో యవగతమైనది.

సిగ్గుచే విద్యార్థుల జూడలేక నేలజూచుచు నడచినాడు. చైత్యగృహముననైన నతడు తలయెత్తలేదు. భోజనవేళ నతని ముఖమున నెత్తురుబొట్టులేదు. చింతాయత్తుడై యితరులతో గలసి మెలసి తిరుగలేకున్నాడు. విద్యార్థులు ధైర్యమొసగి యతనిని బలుకరించుట లేదు. అతని నొక మహాదోషిగ పరిగణించి కొందఱుపాధ్యాయులును, నట్లే ప్రవర్తించినారు. ఆచార్య కాశ్యపుడైన ననురాగ పూర్వకముగ బూర్వమువలె నతనితో సంభాషింపలేదు.

పాపము! శిఖి కవి యన్నియు కాళరాత్రులు! ధ్వజకేతువతనితో మైత్రి యొనర్పమానలేదు. మంగళుడు, అమితాభుడు ననురాగముతో స్నేహము నెరపుచునతని కానందమొనగూర్చ బాటుపడుచున్నారు. గయా శీర్షుడతనిని బుద్ధ పూజాసమయమున, వాహ్యాళి వేళలనప్పుడప్పుడు వెంటగొని పోవుచున్నాడు.

పది దినములైన తరువాత చంద్రశ్రీశాతకర్ణి నాలందకు వచ్చినాడు. దీనికి కారణము ప్రధానాచార్యుడు శీలభద్రుడాయన కొకలేఖ వ్రాయుటయే. కుమారుని చరిత్ర సమస్తమునుపాధ్యాయుల వలన వినినాడు. రెండు దినములచటనేయుండి యతని నేకాంతముగ నడిపించుకొనిపోయి యేమేమో ప్రసంగించినాడు.