కవాటమును దెరచుచప్పుడు వినిపించినది, తలుపు విడివడినది. మూర్తీభవించిన దయాదేవతవలె గయా శీర్షుని యున్నత మూర్తి యెదుట నిలువబడినది. శిఖి నిలువెల్ల చలించి ప్రత్యుత్థాన మొనర్చి' మోకాళ్ళపై నిలిచి "ఆచార్యోత్తమా! నన్ను క్షమింపుడు. మీకు నేను తీరని యపచార మొనర్చినానని నా కర్ణమైనది" అనినాడు. పిమ్మట చేతులు జాచి పాదస్పర్శ యొనర్చి 'మీరు కనిపించిన తక్షణమే నా తప్పిదమును జెప్పుకొని మన్నింప వేడుకొన హృదయ మెంత యారాటపడినదో యందు కిదియే సాక్షి' యని నతశిరస్కుడైనాడు.
“నీవు నాకెంతటి యపచార మొనర్చి దుఃఖమును గల్పించి నావో యిప్పటికైన నిశ్చయముగ గుర్తించినావా?" అని గయాశీర్షుడు రుద్ద కంఠముతో బలికినాడు.
ఆయనలో వెనుకటి ధోరణిలేదు. 'మహాత్మా! నాదోషమవగతమైనది. కాశ్యపాచార్యుల వలన మీరిరువదియైదు సంవత్సరములు దీక్షగ నొనర్చిన కృషిని దగ్గ మొనర్చినానని తెలుసుకొని బాధపడినాను. నన్ను క్షమింపరా?' అని కన్నీరు మున్నీరుగ నేడ్చియుపాధ్యాయుని పాదముల దడిపినాడు.
'బుద్ధభగవానుల క్షమాపణ నర్థించినావా? అని గయా శీర్షుడు గంభీరస్వరమున శిఖిని బ్రశ్నించినాడు.
'దయాసాగరుడు భగవానుడు నన్ను తప్పక క్షమించును. ఒకనాడు నేనిట్టి క్రూరుడ నౌదునని మున్నెన్నడును భావింపలేదు. మహాత్మా! మీయనురాగమున కేరీతిగ బాత్రుడనౌదునో దయయుంచి సెలవీయుడు. నా పరితప్త హృదయమునకు శాంతి చేకూరు'నని శిఖి గయా శీర్షునితో మొరబెట్టుకొనినాడు.
ఉపాధ్యాయునితో బ్రసంగించు సమయమున శాతకర్ణి ముఖమును జూచి మాటాడ లేకపోయినాడు. అతని హృదయ పరివర్తనమును గయా శీర్షుడు గమనించినాడు. ఆయన హృదయమున నిద్రించుచున్న దయాసాగర ముప్పొంగి పోయినది. శిఖిశిరముపై జల్లని చేయినిల్పి నిమురుచు గయాశీరుడు సంతతధారగ గపోలములపై స్రవించుచున్న కన్నీరును దుడిచినాడు. పట్టరాని సంతోషముతో నొకమా రాయన ముఖమున దృష్టి నిల్పినాడు. ఆయన ముఖమును దుఃఖదేవత క్రీడారంగముగ నొనర్చుకొనిది. అయినా నా తేజోమూర్తి యాననమున దయారేఖలు వానకారు మెరపులవలె మెరయుచున్నవి. శాతకర్ణి యాయద్భుత ప్రభావమునకు ముగ్ధుడై సాష్టాంగదండ ప్రణామ మొనర్చి గురుదేవున కాత్మార్పణ మొనర్చుకొనినాడు.