ఈరీతి నాల్గుదినములు గడిచినవి. తెల్లవారిన తరువాత బుద్ధ పూజానంతర మాచార్యులాతనికి శిక్ష జెప్పవలసియున్నది. దానిపై నతనిభవిష్యజ్జీవిత మాధారపడినది. నాలందా విద్యాలయమున బ్రవేశపెట్టుచు తండ్రి పలికిన మాటలతనికి జ్ఞప్తికి వచ్చినవి. తండ్రి కోరికకును తనకు నెంతదూరము!
పొంగి పొరలివచ్చిన దుఃఖము నాపుకొనలేక బిగ్గఱగ నేడ్చినాడు.
ఆ యేకాంతమందిరము కడకెవరో వ్యక్తి ప్రభాత కాలమునకు బూర్వమే వచ్చిన యలికిడి యైనది. అతడు కవాటము దగ్గఱకు జేరినాడు. తలుపునందునుండి యొక లేఖను లోపల బడవైచి యావ్యక్తి భయముతో మందమందముగ పరువెత్తినట్లున్నది. శిఖిని జూడరాదని శీలభద్రాచార్యుని యనుశాసనమే దీనికి కారణమైయుండును.
శిఖి యుత్తరమును జదువ నారంభించినాడు.
"ప్రియసోదరా! శిఖీ! నిన్ను నాలం దావరణమునుండి బయటకు పంపరని నిర్ణయమైనది. ఈ వార్త నిన్నటి సాయంకాలమునుండి నీకెట్లు చేర్తునాయని హృదయమారాటపడినది. ఇప్పటి కవకాశము చిక్కినది. ఇంతకు బూర్వమే యీ వార్తవినిపించి నీ మనః క్లేశము నుపశమింప జేయలేక పోయినందుకు క్షమింపుము. గయాశీర్షుని దర్శించి మేమందరమును నిన్ను క్షమింపవలసినదని ప్రార్థించినాము. శిక్షవలన గల్గు భయముచే గడచిన మూడు దినములు నీతో మాటాడుటకు రాలేదు - నీ మంగళుడు.
లేఖను జదువుకొను నప్పుడొక యవ్యక్తానందమతని హృదయము నావరించినది. సంతోష రేఖలు ముఖమునద్యోతకమైనవి. 'ఆవరణమునుండి నన్ను బహిష్కరింపరు. ఇకనాచార్యపాదు లొసగు నెట్టి శిక్షనైన నిక నేననుభవింపగలను' అని యనుకొనినాడు.
అతని దృష్టి వాతాయనము వంకకు మఱలినది. దూరమున చైత్యాగార శిఖరము కనుపించినది. అతడు నమ్రభావముతో సాష్టాంగ దండ ప్రణామ మాచరించినాడు. ఏదో యనుమానము తోచి లేఖను మఱల జదువుకొన నారంభించి 'మేము గయాశీర్షులను నిన్ను క్షమింపమని వేడుకొనినాము' అనునర్థము గల వాక్యమును మఱల మఱల జదివినాడు. “ఇది నిజమేనా? నా తప్పిదమును గయా శీర్షులు మన్నించినారా? నిజమైన నాయన యెంతటి యుదారుడు! ఏ మహాత్ముని హృదయమున కార్చిచ్చు రగిల్చినానో యాయనయే నన్ను క్షమించినాడా? అతని మనస్సు యాతాయాతముగ నున్నది.