'నీకవమానముగ భావించిన దప్పక పోరాడుదును. కాని నా కానందము లేదు. అన్న వాక్యము గయాశీర్షుని చెవినిబడినది. "నీ కేమియును భయము లేదు. పోరాడు'మని యా యుపాధ్యాయుడు శాతకర్ణిని బుజ్జగించి దుఃఖోపశమనము గావించినాడు.
శాతకర్ణి మఱల రంగస్థలమున బ్రవేశించి యాక్రోశముతో బోరాడుచున్నాడు. మల్ల విద్యలో శిఖి కంతటి ప్రజ్ఞయున్నదని ధ్వజకేతువునకు బూర్వమెన్నడును దెలియదు. ఆకలిగొన్న కొదమసింగమువలె నతడు ధ్వజకేతువుపై లంఘించినప్పుడు విద్యార్థులిక నుత్సాహనినాదము లొనర్పక నూరుకొనలేకున్నారు. ఒకమారతడు ప్రయోగించిన బంధ విశేషమునకు ధ్వజకేతువు పడబోయినాడు. అప్పుడు కరతాళధ్వనులు మిన్నుముట్టినవి. శిఖి ముఖమున నానందము పొడకట్టినది.
మిత్రునకు ప్రథమ బహుమానముపై నాశయున్నదేమోయని యూహించి తానోడి పోయినట్లని బ్రహ్మాయువుకు జెప్పి తాత్కాలికముగ ధ్వజకేతువు నొప్పించి శిఖి వెడలినాడు. నెమ్మదిగ జెప్పి ప్రథమబహూకృతి నతనికే యిప్పింపవచ్చునను నుద్దేశముతో ధ్వజకేతు వపుడంగీకరించినాడు.
ప్రేక్షకులు, విద్యార్థులు, నుపాధ్యాయులు రత్నోదధి భాండాగారమునకు ముందున్న విశాలస్థలమున జేరుకొనినారు. బహుమాన ప్రదాన సమయమున శాతకర్ణి పేరు బిలిచినప్పుడతడు రాలేదు. ప్రథమ బహుమాన మతనికిప్పించి ధ్వజకేతువు ద్వితీయ బహుమానమును తీసికొని, యిరువుర బహూకృతులతో శాతకర్ణిని వెదకుచు నివాసగృహకక్ష్యకు వచ్చినాడు.
శాతకర్ణి ప్రథమ బహుమానమును స్వీకరించుట కంగీకరింప లేదు. ధ్వజకేతువు నేను ద్వితీయబహుమానమును దప్ప స్వీకరింపననినాడు. కొంత సంఘర్షణ జరిగిన తరువాత 'ఈ రెండును మన బహుమానములు ఇరువురకును ప్రథమ ద్వితీయ బహుమానములు వచ్చినట్లు భావింతుమని సంధి జేసుకొనినారు'. ఈ వార్త నాలంద విద్యార్థులందఱలో బ్రాకి పోయినది. ఆ యిరువురు మిత్రుల ఖ్యాతి విస్తరించినది. అందు విశేషముగ శాతకర్ణి నేడు లోపరహితుడు. ఆచార్యులకు నుపాధ్యాయులకు బ్రియశిష్యుడు. కాని యతని దుఃఖమింకను బూర్తిగ నివారణ కాలేదు. కాశ్యపాచార్యుడింక నతనిని పూర్వగౌరవముతో జూచుట లేదు. క్రమముగ శిఖియా యాచార్యునకు బ్రీతిపాత్రుడైనాడు. కాని యతడింకను 'నిన్ను క్షమించినా'నని పలుకలేదు. నేడతడొనర్చుచున్న యత్నమంతయు దాని కొరకే.