సందర్భవశమున శిఖి తండ్రిని నాలందయన నేమని ప్రశ్నించినాడు. 'న-అలమ్-ద’ పూర్ణముగ నిచ్చునది కాదు. విద్యార్థులకు జీవిత మార్గమును జూపించి విడిచిపెట్టునది. 'ఇదియే విద్యాలయమునకు బరమధర్మ' మని తండ్రి కుమారునికి జెప్పినాడు.
“నాలందలో నాచార్యులు, నుపాధ్యాయులు విజ్ఞాన మహోదధులు. వారి విద్యాగర్భముల నెన్నెన్నో రత్నరాశులున్నవి. వారిని సేవించి వాటిని గ్రహించుటయే విద్యార్థుల కర్తవ్యము” అని చెప్పి యందున్న రత్నోదధి, రత్నసాగర, రత్నరంజక గ్రంథ నిలయముల గుఱించి చండశ్రీ ప్రస్తావించినాడు. అందలి యాలయములు, విహారముల, విద్యామందిరముల స్వరూపమును గోచరింపజేసి కుమారుని కత డాసక్తి గల్పించినాడు.
ఉన్నత శిఖరము పైనుండి శకటము దిగుచున్నప్పుడు దూరముగ గన్పించిన నాలందను జూపించుచు "ప్రకృతి హృదయ దేశమున పసిపాపవలెనున్న యీ విద్యాలయ మెంత రమణీయముగ నున్నది? ఈ ప్రశాంత వాతావరణమున సత్సాంగత్యమును బొంది శ్రద్ధాభక్తులతో విద్య నార్జించియుదాత్త మూర్తివై నీవు తిరిగి వచ్చుటయే నా చిరకాల వాంఛ”యని పలికినాడు.
"శక్తివంచనలేక శ్రమించి మీ కోరిక నీడేర్చెదను" అనురాగమునకు బాత్రుడ నౌటకే యత్నింతు"నని శిఖిశాతకర్ణి తండ్రికి సమాధానము జెప్పినాడు.
త్వరిత గమనమున చైత్యగృహమును జేరుకొని బుద్దపూజానంతరము తండ్రి కుమారులిరువురు నాలంద ప్రధానాచార్యుడు శీలభద్రుని ప్రత్యేకమందిరమును జేరుకొని నారు. ఒకయున్నత వేదికపై గూర్చొని యతడు గ్రంథపఠన మొనర్చుచున్నాడు. చండశ్రీ కుమారునిచే నాచార్యునకు బాదాభివందనము జేయించినాడు.
అవసరోచిత సంభాషణలు సాగినవి. శిఖిని శీలభద్రుడు విద్యార్థిగ స్వీకరించి 'నీ కాచార్యుడు, కాశ్యపుడు, గయా శీర్షుడు పాధ్యాయుడు' నని చెప్పి బంపించినాడు.
ఆదినమే సాయంత్రము చండశ్రీ మఱల నింటికి బ్రయాణమైనాడు. నాలంద ప్రథమ ప్రాకార ద్వారము వరకు ననుసరించి వచ్చిన కుమారునకు బుద్ధులు గఱపి శకటముపై నధిరోహింపబోవుచు 'శిఖీ! మన వంశగౌరవమును, బేరుప్రతిష్ఠలు నీవలన నిలువ వలసియున్న వనిన వాక్యము శిఖి హృదయమున గాఢమున హత్తుకొనినది. 'భద్ర'మని పలుమారులు పలికి కుమారుని నిలువుమని యాజ్ఞాపించి చండశ్రీ శకటమును సాగించినాడు. కనుజూపున కందునంతవఱకు ననురాగముతో జూచి శిఖి శాతకర్ణి తండ్రి నుద్దేశించి కరాంజలి ముకుళించి వెనుదిరిగి వచ్చినాడు.