Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలంద

"శిఖీ! మనకు శుభశకునమైనది. నాలంద పవిత్రఘంటిక బుద్దపూజకై యందఱ బిలచుచున్నది. మనమును త్వరితముగ బ్రవేశించి, చైత్యగృహమున కేగి యందుఁ బాల్గొందము”.

నాలంద విద్యాలయ బహిఃప్రదేశమునం దుత్తరద్వారమున నశ్వశకట మాగినది. అందుండి చండశ్రీ శాతకర్ణి పదునైదు వత్సరముల బాలుని చేయూత యిచ్చిదింపినాడు.

చండశ్రీ పూర్వమొక శతాబ్ది కాలము మగధ సామ్రాజ్యము నేకచ్ఛత్రముగ బాలించిన శాతవాహన వంశమున జన్మించిన రాజపుంగవుడు. ఆ సామ్రాజ్యము పతన మొందిన పిమ్మట వారి వంశస్థులు గౌతమీపుత్ర శాతకర్ణి నేతృత్వమున దక్షిణాపథాధిపతులై మహత్తర వైభవముతో రాజ్యపాలన మొనర్చినారు.

గౌతమీపుత్రశాతకర్ణికి సవతితమ్ముడు మేఘల శాతకర్ణి. ఇతడు మహావీరుడు. పాటలీ పుత్ర ప్రాంతమును స్వశక్తితో రక్షించుకొని బహుకాలము పాలించినాడు. అతనికిఁ బది యవ తరమువాడే యీ చండ్రశ్రీ శాతకర్ణి.

శిఖి చంద్రశ్రీశాతకర్ణి ప్రథమపుత్రుడు. సుగుణరాశి, స్ఫురద్రూపి. తండ్రియతని బాల్యము నుండి గారాబముతో బెంచినాఁడు. విద్యాబుద్ధులు గరపుటలో కడు శ్రద్ధ వహించినాడు. అది క్రమబద్ధమైనదికాదు కాని శిఖి శ్రద్ధతో గొంత విద్య గడించినాడు. అతని వయస్సులో నున్న నాలంద విద్యాలయ విద్యార్థులకంటె నతడు విజ్ఞాని, అయినను వారుపొందిన విద్యకును, శిఖి స్వీకరించిన విద్యకును విశేష విభేదమున్నది.

స్వార్థ మెరుగని యుత్తమాచార్యుల సేవాత్యాగముల ఫలితముగ నాలంద విఖ్యాతి యుత్తరాపథమున దశదిశల వ్యాపించుచున్నది. కుమారు నుత్తమధర్మవీరునిగ, నుదాత్త మానవునిగా దీర్చిదిద్దుటయే జీవితాశయముగ నెంచుకొనుచున్న చండశ్రీని యాకీర్తి యాకర్షించినది. కుమారు నా విద్యాలయమున నుత్తమాచార్యులకడ జదివించుట యుక్తమని తలపోసి నేడతనినందు బ్రవేశ పెట్టుటకు దీసుకొని వచ్చినాడు.

వారు దీర్ఘప్రయాణ మొనర్చినారు. కాని విసుగు జనింపలేదు. నిరంతర సంభాషణతో చండశ్రీ కుమారుని కనేక విషయములు తెలియజెప్పినాడు.