Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అణుమాత్రంగా మోతాదుకు మించి పుచ్చుకున్నా, సమయానికి పుచ్చుకోకపోయినా, నేను ఆశిస్తున్న పరిపూర్ణనూతనరూపం మూర్తీభవించకపోవటమే కాకుండా, ఉన్న రూపానికి కూడా గొప్ప ముప్పును కలిగించవచ్చు. అయినా నాకు ఈ ఔషధశక్తిని పరీక్షించాలెనన్న ఆసక్తి అపారం కావటం వల్ల, ఎటువంటి ప్రమాదభయసూచనలనూ పరిగణించలేదు. బహుకాలం క్రిందటనే నేను ఈ అరఖును తయారుచేశాను. అందులో మరొక ప్రత్యేకక్షారాన్ని తుది ఔషధంగా చేర్చవలసిన అవసరం ఉంది అని నా పరిశోధనలవల్ల నేను గమనించాను. అందువల్ల రసాయనికద్రవ్యాలలో టోకువ్యాపారం చేసే ఒకడివద్ద ఆ క్షారాన్ని ఒక్కమాటే పెద్దమొత్తంగా కొని ఉంచుకొన్నాను. ఒక పాపిష్ఠిరాత్రి చాలాభాగం గడచిన తరువాత, నేను ద్రవ్యాలన్నింటినీ కలిపి మిశ్రమం చేశాను. అవి అన్నీ మిళితమై ఉడికి ఆవిరి కక్కుతూ ఉండటాన్ని గమనించాను. పొంగును చల్లారనిచ్చి ఒక ధైర్యవికాసంతో నేను దాన్ని పుచ్చుకొన్నాను.

శరీరంలో భరించరాని నొప్పులు ఆరంభమయ్యాయి. ఎముకలు గుల్లయిపోతున్నవి. వెర్రివికారం ప్రారంభమైంది. జననకాలం, మరణంకాలం రెంటిలోనూ ప్రాణి పొందే వేదనవంటి వేదన ప్రారంభమైంది. అనతికాలంలో ఈ వేదన క్రమంగా చల్లారింది. నాకు ఒక మహావ్యాధిలోనుంచి బయటపడ్డట్లనిపించింది. నా ఇంద్రియ పరిజ్ఞానంలో ఏదో వింత గోచరించింది. వినూత్నమైన స్పృహ ఒకటి వినూత్నంగానూ, వర్ణనాతీతంగానూ ద్యోతకమైంది. ఆనకొక క్రొత్త రూపు ఏర్పడ్డది. అందలి నవ్యతవల్ల నాకప్పుడు అది మధురాతిమధురంగా కన్పించింది. నాకు ఏదో యవ్వనం వచ్చినట్లు తోచింది. శరీరం తేలికైనట్లు, దేహం నిండా ఆనందం తాండవిస్తున్నట్లు ఒక గర్వం, ఒక నిర్లక్ష్యం నా హృదయాన్ని క్రమ్మివేశాయి. ఇంద్రియ భోగవాంఛలతో నా శిరస్సు మత్తెక్కింది. సమస్త బంధనాలూ విచ్ఛేదం చేసుకొని విశృంఖలంగా విహరించాలని ఆత్మ ఉవ్విళ్లూరుతున్నది. అయితే, ఈ స్వేచ్ఛాభికాంక్ష సత్ప్రయోజనాలను సాధించటం కోసం కాదని నాకు తెలుసు. ఈ నూతన జీవితారంభదశలోనే నాలో పూర్వం ఉంటూ వచ్చిన దౌష్ట్యానికి పదిరెట్లు దౌష్ట్యం మించిందనీ, నేను దానికి బానిసగా అమ్ముడుపోయినానని స్పష్టంగా నాకు తెలిసింది. ఈ భావం నాకు ఆ సమయంలో రుచిగల ద్రాక్షాసవంగా ఆహ్లాదాన్ని కల్పించి కైపెక్కించింది. ఈ నూతనమైన ఇంద్రియ చేతనత్వాలకు ఉబ్బి తబ్బిబైపోతూ, చేతులను ముందుకు చాచి చూచుకొన్నాను. ఈ రూపపరివర్తనలో నాకు కుబ్జత్వం ప్రాప్తించిందని హఠాత్తుగా స్పురించింది. 536 వావిలాల సోమయాజులు సాహిత్యం-3