ఆ తేదీనాటికి నా గదిలో భూతద్దం లేదు. ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నప్పుడు నా వెనకనే ఉన్న ఈ అద్దాన్ని తరువాత నా రూపపరివర్తన విశేషాలను చూచుకోటం కోసం, కొంత కాలానికి తెప్పించాను. ఆ రాత్రి తెలతెలవారబొయ్యే వరకు గడిచింది. ఆ వేళొక సమయంలో నా ఇంట్లో పనివాళ్లందరూ గాఢనిద్రాపరవశులై ఉన్నారు. నూతనంగా ప్రాప్తించిన విజయోత్సాహంతో, నా క్రొత్త రూపంతో, నేను నా శయ్యామందిరంవరకూ వెళ్ళడానికి సాహసించాను. పెరడు దాటాను. నక్షత్రరాశుల చూపులు నా మీద పడ్డాయి. ఎల్లవేళలా అప్రమత్తతతో సర్వాన్నీ తిలకించే ఆ నక్షత్రరాశుల కంటబడని నూతన శరీరధారిని క్రొత్తనైన నేనే కదా అన్న భావం నాకు కలిగింది. నడవలన్నిటిలో నా ఇంట్లో నేనే ఒక క్రొత్త వ్యక్తిగా తిరిగాను. నా గదిలోకి వచ్చి, మొట్టమొదటిసారిగా ఎడ్వర్టు హైడ్ అనే వ్యక్తి ప్రపంచంలో ప్రవేశించటాన్ని చూచాను.
ఇక చెప్పబోయేవి నేను నిర్ణయాలని గ్రహించినవి కావు ఇలా జరగటానికి వీలున్నదని ఊహించినవి కూడా కావు. అటువంటి కొన్ని విషయాలను గురించి తాత్త్విక సిద్ధాంతాత్మకంగా నేను కొంత చెప్పవలసి ఉంది. నా ప్రకృతిలో ఉన్న దుష్టస్వభావాన్ని ఇప్పుడు మూర్తీభవింపజేశాను. కాని ఇది ప్రస్తుతం నాలో నుంచి దూరంగా తొలగించి ఉంచుకొన్న సుస్వభావం వంటి పుష్టినిగాని, పరిమాణాన్నిగానీ కలది కాదు. నా జీవితంలో అధికాంశం, పదింట తొమ్మిది పాళ్లు, నిరంతరసాధనతోనూ, సత్ప్రవర్తనతోనూ, నిగ్రహంతోనూ గడిచింది. అందువల్ల నా దుష్టత్వానికి తగ్గ పోషణ కలక్కపోవటం వల్లా, పరిణామాన్ని పొందేటందుకు అవసరమైన అవకాశాలు లభించకపోవటం వల్లా ఎడ్వర్టు హైడ్ రూపం కుబ్జత్వాన్నీ, లఘుత్వాన్నీ వహించవలసి వచ్చింది. ఈ కారణం వల్లనే హెన్రీ జెకిల్ కంటే ఎడ్వర్టు హైడ్ తరుణమూర్తిగా తయారైనాడు. ఏ రీతిగా జెకిల్ ముఖంలో సుస్వభావం లిఖితమై కన్పిస్తున్నదో, అదేరీతిగా రెండో వ్యక్తి ముఖంలో దుఃస్వభావం విస్పష్టంగా లిఖితమై గోచరిస్తున్నది. ఈ దుస్వభావమే హైడ్ ఆకారానికి వికారాన్నీ, కార్శ్వాన్నీ కలుగజేసింది. కానీ నేను నా హైడ్ రూపాన్ని అద్దంలో చూచుకొన్నప్పుడు ఎటువంటి అసహ్యాన్నీ పొందలేదు. ఆ మూర్తిని హర్షంతో ఆహ్వానించాను. ఆ రూపమూ నాదే. అదీ నా సహజప్రకృతే. అది మానవత్వం కాదనుకోటం పొరబాటు. అదీ మానవత్వమే మానవలక్షణమే. పరిపూర్ణం గాని ద్వంద్వప్రకృతి నాలో ఉండి ఇంతవరకూ అది నా ముఖాన ప్రతిబింబిస్తుండేది. దాన్ని చూచుకొనే ఇది నేను అని అనుకోటానికి అలవాటు