Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటకవిషయంలో గానీ, ఇతర రోమక నాటకాల విషయంలో గాని తీసుకోలేదు. షేక్స్పియర్ చెప్పిన ఆంగ్లదేశ చారిత్రక నాటకాలకు కావలసిన వస్తువులిచ్చిన హాలిన్షెడ్ కు, రోమక చారిత్రక నాటకాలకు కావలసిన వస్తువునిచ్చిన ప్లూటార్క్ కు ఎంతో విభేదం ఉంది. ఈ విషయాన్నే ఒక అనుభవజ్ఞుడు ఇలా చెప్పాడు: "షేక్స్పియరు హాలిన్షెడ్ తరువాత కాల్చి బాగు చేసుకోవలసిన అపరిష్కృతలోహాన్నిస్తే, కవి కళాదుడు తీర్చిదిద్దవలసిన నగిషీ మినహాగా సర్వం ప్లూటార్క్ తానే ఏరి కూర్చి ఇచ్చాడు. అందువల్ల షేక్స్ పియర్ కు స్వల్పమైన మార్పులు చేసి సీజర్, బ్రూటస్, ఆంటోనీల జీవితాలలోనుంచి పుట తరువాత పుట దించుకోవటం తప్ప వేరే పనిలేకపోయింది”

షేక్స్పియర్ ప్లూటార్క్ దగ్గరనుంచీ మొత్తం కథను గ్రహించాడు. లూషియస్ తప్ప మిగిలిన పాత్రల నందరినీ స్వీకరించాడు. నాటకంలో కనిపించే పాంపే పుత్రులపై సీజర్ విజయం, ఇరువురు ధర్మాధికారులు (మరులియస్, ప్లేవియస్) ప్రజలను నిందించి చెదరగొట్టటం, లూపర్ కేలియా ఉత్సవాలు, ఆంటోనీ సీజరుకు చేసిన కిరీట ప్రదానం, బ్రూటస్ పోర్షియాల సంభాషణ, సీజర్ పతనాన్ని సూచించే శకునాలు, కల్పూర్నియా పట్టుదల, డెసియస్ బ్రూటస్ సీజర్ను ఒప్పించటం, శకునజ్ఞుడు, ఆర్టిమిడోరస్ సీజర్ కు చేసిన సూచనలు, హత్య, ఆంటోనీ ప్రసంగం, ఇచ్ఛాపత్రపఠనం. సిన్నామరణం, సీజర్ భూతరూపదర్శనం, ఫిలిప్పీయుద్ధం, కాషియస్ బ్రూటస్ ల మరణం అన్నీ ప్లూటార్క్ లో ఉన్నవే. సీజర్ సుస్తి, మూఢనమ్మకాలమీద అభిమానం, ఆంటోనీ విలాసప్రియత్వం, సిసెరో గ్రీక్ భాషాభిమానం, కాసియస్ 'పలచని ఆకలి చూపు', అతని ఎపిక్యురస్ అనుయాయిత్యం, అతని కోపస్వభావం అన్నీ ప్లూటార్క్ నుంచి సంగ్రహించినవే.

షేక్స్పియర్ ప్లూటార్క్ కి భిన్నంగా కొన్ని కల్పనలు చేశాడు. ఆరు నెలలనాడే (సెప్టెంబర్ 45 క్రీ.పూ.) సీజర్ 'విజయయాత్ర'నుంచి తిరిగివస్తే ఈ అంశాన్ని షేక్స్పియర్ లూపర్ కల్ ఉత్సవం నాటికి 15 మార్చి 44 క్రీ.పూ. అని మార్చినాడు. సీజర్ హత్య క్యూరియాపాంపేలో జరిగితే దాన్ని దేవమందిరానికి మార్చాడు. హత్య మార్చి 15న, 'ఇచ్ఛాపత్ర ప్రచురణ' మార్చి 18న, అంత్యక్రియలు మార్చి 19న జరిగినవి. ఆక్టేవియస్ మే నెల దాకా రాలేదు. షేక్స్పియర్ అన్నీ ఒకనాడే జరిగినట్లు కల్పించాడు. 'వీరత్రయకూటమి' బోలోనియాలో కలుసుకుంటే షేక్స్పియర్ ఆ సంఘటన రోములోనే జరిగినట్లు చెప్పాడు. ఫిలిప్పీలో జరిగిన రెండు యుద్ధాలకూ మధ్య ఇరవై


20 వావిలాల సోమయాజులు సాహిత్యం-3