Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మన్న : (తలమీద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్న కొమ్మరాజుతో)

బావా! మీకు అంగీకారమేనా?

కొమ్మరాజు : అలరాజు మరణించిన తరువాతనైనా అన్నదమ్ములు తిరిగీ ఆత్మబంధువులవుతున్నారు. తాత్కాలికంగా పౌరుషవాక్యాలు పలికినా దేశాన్ని యుద్ధప్రళయంలో దింపమనడీ కొమ్మరాజు.

కేతరాజు : (త్వరగా తీసి తాళపత్రం అందిస్తూ బ్రహ్మన్నతో) ఇక సంధి పద్ధతి వ్రాయించండి. మలిదేవ మహారాజెక్కడ?

బ్రహ్మన్న : అవతల గొల్లెనలో నిద్రపోతున్నారు. వారి అంగీకారం నేను ఇప్పిస్తాను బావా! పత్రం తీసుకోండి అదిగో ఘంటం.

కొమ్మరాజు : (కేతరాజు చేతిలో పత్రం అందుకొని బ్రహ్మన్న చూపిస్తున్న ఘంటం తీసుకొని వ్రాయటాని కుద్యుక్తుడై) ప్రారంభించండి.

బ్రహ్మన్న : రాజాధిరాజ

కొమ్మరాజు : ఉ!

బ్రహ్మన్న : రాయవేశ్యాభుజంగ

కొమ్మరాజు : ఆఁ!

బ్రహ్మన్న : విభవ దేవేంద్ర వీరకామ నరేంద్ర రాజేంద్రులవారికి

కొమ్మరాజు : ఉఁ!

బ్రహ్మన్న : హై హయ వంశ పారావార విజ్జలదేవీ గర్భశుక్తి ముక్తా ఫలం శ్రీమలిదేవమహారాజు వ్రాయించి ఇచ్చిన... (పెద్ద గొంతుతో) సంధి పత్రం...

బాలచంద్రుడు : (వీరాకృతితో సాటోపంగా ప్రవేశించి వీరముద్రికతో నమస్కరిస్తూ) సంధిపత్రం... ఎవరితో సంధి, ఎందుకు సంధి.... ఎలా సంధి?

(కోటకేతు, కన్నమ, బ్రహ్మన్న బిత్తరపోయి చూస్తుంటారు)

కొమ్మరాజు : బాలుడూ ఏమిటిది?

బ్రహ్మన్న : నాయనా! నీవేమన్నా చెప్పదలచుకున్నావా? లే!


నాయకురాలు

77