కేతరాజు : గడచి బ్రతుకవలసినంత అగత్యం ఏమున్నది బాబూ? అంతా మీ ఇష్టప్రకారమే కానివ్వండి.
కొమ్మరాజు : యువరాజా! నాగమ్మ మిమ్మల్ని పంపించిందా?
కేతరాజు : అవును రాజూ! ఏవిధంగానైనా సంధి పొసగించుకొని రమ్మన్నది. రాజు అంగీకరించాడు.
బ్రహ్మన్న : మలిదేవ మహారాజుకు అర్ధరాజ్యం ఇవ్వటం అంగీకారమేనా?
కేతరాజు : అవును బాబూ!
కొమ్మరాజు : ఆరునెలల పుల్లరీ పంపిస్తుందా?
కేతరాజు : ఇదిగో నా వెంటనే పంపించింది.
కన్నమ : మా గోవులను వదిలి పెడతారా ప్రభూ?
కేతరాజు : (తీక్షణంగా చూచి) వెంటనే వదిలి పెట్టేటట్టు చేయిస్తాను.
బ్రహ్మన్న : అయితే...
కేతరాజు : సంధి పొసగినదన్నమాటే.
బ్రహ్మన్న : సంతోషం!
కేతరాజు : బ్రహ్మప్రయత్నం చేశాను. అన్నదమ్ములు మీరు పోరుకు దిగితే పునీతమైన పల్నాటిసీమ పొలికలనై పోతుందని చెప్పాను. విశ్వ ప్రయత్నం మీద అంగీకరించారు. ఉఁ అయితే...
(బ్రహ్మన్న కొమ్మరాజు కన్నమ చెవులు రిక్కించి వినటం అభినయిస్తారు)
అన్నదమ్ములందరూ ఏకమై రాజ్యాన్నంతా ఏకచ్ఛత్రాధిపత్యం కింద పరిపాలించుకుంటే ఎలా ఉంటుంది?
బ్రహ్మన్న : (పరమానందంతో) అది నాకు మరీ సంతోషం.
కన్నమ : (అసంతృప్తితో గద్గదకంఠుడై) తండ్రీ!
బ్రహ్మన్న : కన్నమా... అడ్డు రావద్దు.
కేతరాజు : సంధి పత్రిక ఇప్పిస్తారా?
76
వావిలాల సోమయాజులు సాహిత్యం-2