Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలచంద్రుడు : (లేస్తూ) అవును సంధి పనికిరాదని చెప్పదలుచుకున్నాను.

బ్రహ్మన్న : కారణం నాయనా?

బాలచంద్రుడు : అర్ధరాజ్యం ఇస్తారటనా?

బ్రహ్మన్న : ఆఁ!

బాలచంద్రుడు : గోవులు వదిలి పెడతారా?

కొమ్మరాజు : ఆఁ!

బాలచంద్రుడు : పుల్లరి చెల్లిస్తారా?

బ్రహ్మన్న : ఆఁ!

బాలచంద్రుడు : (జ్ఞప్తికి తెచ్చుకుంటూ) ఇంకా!

బ్రహ్మన్న : అన్నదమ్ములు అందరూ ఏకమై గురిజాల నుంచి పరిపాలించు కుండేటట్లు సంధి.

బాలచంద్రుడు : అదీ, కావలసిన సంగతి. రాజ్యచక్రం త్రిప్పించేది మహామంత్రిణి నాగమ్మేనా?

(కోటకేతరాజు తెల్లబోయి ముఖం తేలవేస్తాడు)

బ్రహ్మన్న : అయితే ఏం నాయనా?

బాలచంద్రుడు : అది పనికిరాదు. యుద్ధం జరిగి తీరవలసిందే రాబొయ్యే ఈ ఆహవజనమేజయ సర్పయాగాగ్నిజ్వాలల్లో కాలకూట విషం కక్కుతూ నాగమ్మ, మహానాగం, మండి మారణహోమం కావలసిందే. ఆమె ఉన్నంత వరకూ దేశంలో అంతఃకలహాలు తప్పవు.

బ్రహ్మన్న : (ప్రశాంతముగా) సంధి పడగొట్టకు తండ్రీ! అంతటి నాగమ్మ ఇంతవరకూ వచ్చిందంటే ఏదో మార్పుంటుంది.

బాలచంద్రుడు : మార్పా? మళ్ళీ కోడిపందాలాడించటం.

కొమ్మరాజు : యుద్ధం దేశానికి ఉపద్రవం తండ్రీ!

బ్రహ్మన్న : కలుషాలకు నిలయం. కాటకానికి కారణం... పుంస్త్వానికి వేరుపురుగు.


78

వావిలాల సోమయాజులు సాహిత్యం-2