Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైష్ణవశాఖ వారి సంప్రదాయంలో జయదేవుడు ఉత్కలదేశంలో జన్మించాడనే ఉంది. ఇప్పటికీ ప్రతీ సంవత్సరమూ జయదేవ గౌరవార్థం వేదువి గ్రామంలో 'మేలా' జరుగుతున్నది. కాబట్టి వంగ దేశ విద్వాంసులు ఆ గ్రామమే కేందు బిల్వ మని అంటున్నారు.

ఈ లేఖనుబట్టి జయదేవుని జన్మస్థాన మిదమిత్థమని నిర్ధారితం కాలేదు. కానీ ఉత్కల దేశ గ్రంథకర్తలు జయదేవుడు 'తమవా'డని ఉద్ఘోషించినారు. గీతగోవింద ప్రతుల్లోనే కేందు బిల్వానికి తిందుబిల్వమూ బిందుబిల్వమూ అనే రూపాంతరాలు కనిపిస్తున్నవి.

కొందరు జయదేవుని కేందుబిల్వమును వంగదేశంలోని వీరభూమి జిల్లాలోని కేందులి గ్రామమని భ్రాంతి పడినారు. అది అజయనదికి ఉత్తర తీరాన ఉన్నది. అజయ భాగల్పూరు జిల్లా దక్షిణాంశములో పుట్టి నంటాల్ పరగణా దక్షిణాంశములో ప్రవహించి తరువాత వీరభూమి, వర్ధమాన జిల్లాల మధ్యగా, తూర్పుగా వెళ్ళి కాటోజార్ దగ్గిర భాగీరథిలో పడుతుంది. వీరభూమి జిల్లాకు ప్రధాన పట్టణమైన సురికి ఇది రమారమి తొమ్మిది క్రోసుల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో రాధాదామోదర విగ్రహాలు ఉన్నవి. అందువల్ల ఇది జయదేవుని జన్మ గ్రామమై ఉంటుందన్న అభిప్రాయంతో తరువాత చారిత్రక పరిశోధన జరిపినవారు ఏకీభవించటం లేదు.

వీరి అభిప్రాయంలో కెందులి ప్రాంతము పూరీ జిల్లాలోని రెహంగ్ వద్ద ఉన్న - కెందులి సానసము, కెందులి పట్నము, కెందులి దౌళి- మూడు గ్రామములలో కలసిన దేశము. ఇవి 'ప్రాచీ’నది ఒడ్డున ఉన్నవి. ఈ నది ఒరిస్సా దేశీయుల దృష్టిలో పరమ పవిత్రమైంది. ఈ నదిని ప్రాచీన మాహాత్మ్యమూ, పద్మపురాణమూ సరస్వతీనది అని వ్యవహరించినవి. 'సాక్షాత్సరస్వతీ ప్రాచీ నాన్యధా నృపసత్తమా క్రోశే, క్రోశేచ లింగాని తటే తస్యా మనోరమే' అనే కపిల సంహిత లోని శ్లోకం ఇందుకు ప్రమాణము. కెందులి గ్రామ సీమనుండి రెండు మైళ్ళ దూరంలో కుశభద్రానది రెండు పాయలతో ప్రాచీనదిని కలిసే చోటును జనం 'త్రివేణీసంగమ' మని వ్యవహరిస్తారు. కెందులి గ్రామంలో వాసుదేవ విగ్రహాలు నారాయణ నామంతో అనేకం కనిపిస్తున్నవి. ప్రాచీనది ఒడ్డున నిలిచి ఒకమారు సింహావలోకనం చేసే వారికి చైతన్యస్వామి కాలంలో పంచమహాపురుషుల్లో ఒకడని ప్రసిద్ధి పొందిన అచ్యుతానందుడు శూన్య సంహితలో కెందులిని వర్ణించిన అతిశయమంతా గోచరిస్తుంది. అందువల్ల జయదేవుని జన్మగ్రామం


518

వావిలాల సోమయాజులు సాహిత్యం-2