Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీరా: నాథా... నాథా... గోధామమునుంచి వచ్చావా... ఎటునుంచి వచ్చావు... అమృతమా... నాకోసమా ప్రభూ... ఏది? ఏది? (విష పాత్రను అందుకోబోతూ)


దాసిమీరా పైన దయ కలిగెనా నేడు
అమృతపాత్రిక నీయ నరుదెంచినావా!
                         ఓనాథ, ఓనాథ!
తాళలేనోయి నే నాలసింపగ నేల?
అమృతపాత్రిక నిమ్ము. ఆరగించెద నోయి!
నీవె నేనై నాథ! నేనె నీవై నాథ!
మీరాకు జన్మమిక మిథ్యయేనా నాథ
ఓనాథ, ఓనాథ!


(అని అందుకొని గుటగుటా తాగి) అబ్బ... హాఁ హా.... (నెమ్మదిగా నేల మీదికి ఒరుగుతుంది)

వనజ: (పరుగెత్తుకుంటూ ప్రవేశించి) అమ్మా! అమ్మా! అప్పుడే తాగేశావా! నేను పరుగెత్తుకుంటూ వచ్చేలోపలనే ఎంతపని జరిగింది! అది కాలకూటవిషము తల్లీ... (రాణావైపు చూచి, చకితయై) ప్రభువే స్వయంగా వచ్చి ఇచ్చారా! అయ్యో! అయ్యో! (అని పక్కకు తొలగి ముఖము ఎదుటికి వచ్చి నిలువబడుతుంది)

రాణా: (మీరాతలవైపుకు వచ్చి నిలువబడతాడు)

ఒక గోసాయీ: (ఉగ్రుడై) రాణా! మహాభక్తురాలికి విషమిచ్చి పాతకానికి ఒడికట్టావు!

మీరా: (నెమ్మదిగా లేస్తూ) నానాథుడు నేను ఇద్దరమూ ఇప్పుడు ఇక్కడనే మాట్లాడుతుంటిమే! ఆయన ఏమైనాడు? ఎక్కడికి పోయినాడు? బృందకు పోవాలన్నాడు వెళ్ళాడా!

(పరికించి) ఎవరిది? గోస్వామి! ఇదెవరు! రాణా!

రాణా: (గద్గదకంఠంతో) దే...వీ!

మీరా: (నిశ్చేష్టురాలై) రాణా!

రాణా: దేవీ! నీభక్తి ఇంత మహత్తర మైన దని ఎరుగక అనుమానించి బాధపెట్టినవాణ్ణి.


ఏకాంకికలు

509