శ్రీనాథుడు : అవేం నా పిల్లకు అచ్చటా ముచ్చటా తీరుస్తవా? అన్నం పెడతవా - అయినా ఒక మాట అడుగుతాను మీకు కోపం రాకుండా ఉంటే. మహారాజులంటే మీకు తృణప్రాయంగా ఉన్నది గాని మీరేం మహాకవులు. తిక్కనాదుల కంటె ఎక్కువా? ఆయన మనుమసిద్ధికి కావ్యం అంకితమివ్వలేదా. ఆయనచేత 'మామా' అని పిలిపించు కోటానికి మనసు పడలేదా-
పోతన్న : చిన్నతనంలో చేసిన తప్పిదాలను చెరిపేసుకోటానికే యజ్ఞం చేసి సోమయాజిగా మారి భారతాన్ని హరిహరనాథాంకితం చేసి అమృతమూర్తి అయినాడు.
శ్రీనాథుడు : మీ కుటుంబ స్థితితో ఈ ఆశయాన్ని ఎంతకాలం నెగ్గించుకుంటారో చూడాలి.
పోతన్న : అదంతా ఆ మహానుభావుడి కృప.
(దారువిగ్రహం వైపు చూపిస్తాడు)
మల్లన్న : మామా! నీకు ఈ విషయంలో ఇంతపట్టుదల ఎందుకు - పిల్లనిచ్చేది నాకు గాని, మా నాన్న సంపాదించి యిచ్చే నా అగ్రహారానికి కాదుగా. అధవా నా దురదృష్టం వల్ల అది పోగొట్టుకుంటాననుకో - అప్పుడేం చేస్తావు?
శ్రీనాథుడు : అందుకని చూసి చూసి పిల్లకు స్వయంగా నా చేతులతో గొంతుకు ఉరిబోసి గోతిలో దించుతానా-
మాచమ్మ : (పోతన్నతో) ఏమండీ! ఏమీ మాట్లాడరేం.
పోతన్న: నన్నేం మాట్లాడమంటావు?
మాచమ్మ : మా వాడు చెప్పిన మాటకు మీరేం సమాధానం చెపుతారు?
పోతన్న : కంఠంలో ప్రాణమున్నంతవరకూ నా కావ్య కన్యకను శ్రీరామచంద్ర మూర్తికి తప్ప ఇతరులకిచ్చి వివాహం చేయలేను.
మాచమ్మ : మా పుట్టింటితో సంబంధం వదులుకుంటానికే సంసిద్ధులై నారన్నమాట.
మల్లన్న : ఎందుకాయనకు ఊరికే ఒత్తిడిచేసి బాధ పెట్టటము.
శ్రీనాథుడు : (లేస్తూ) అక్కయ్యా! వారి దృష్టి వేరు నా దృష్టి వేరు. ఇంక నీకూ - నాకూ ఇంతటితో సంబంధం తీరిపోయినట్లే. మల్లన్నా! నీవైనా నావెంట బయలుదేరి రావటానికి ఏమైనా అభ్యంతరమున్నదా?
ఏకాంకికలు
367