Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాచమ్మ : ఏమో! నాయనా, చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వచ్చాడు. వెళ్లక తప్పదట. మల్లన్న: వెళ్లక తప్పదూ? ఎందుకు తప్పదో చూతాం. ఉత్సవాలెప్పుడో ఇంకా మాసం పై చిలుకుంటే వీరంతా ఎంత కార్య నిర్వాహకులైనా ఇప్పటినుంచే ఏం చేస్తారేం. ఆయన ఉండదలచుకోక ఇదొక సాకుచెప్పుతున్నాడు గాని. శ్రీనాథుడు కాదులే మల్లన్నా, నన్ను బలవంతం చెయ్యవద్దు. నేను ఒక్కణేకాదు, తిప్పయ్యసెట్టి కూడా బయలుదేరి వచ్చాడు. అతడు నాకంటే ముందే రాచకొండ చేరుకుంటాడు. మాచమ్మ : అబ్బాయీ! తిప్పయసెట్టి అంటే నీకు తెలుసునా మామకు చిన్నప్పటి నుంచీ స్నేహితుడు. గొప్ప శ్రీమంతుడు. మల్లన్న : మనిషినైతే చూడలేదుగాని తిప్పయ్య పేరు వినకపోవటమేం. తిరగటి కల్లులాగా దేశదేశాలూ తిరిగి కర్పూరం, చందనం, పునుగు జవ్వాజి అదే పేర్లతో రాజుల నందరినీ దోచుకుంటుంటాడు. ఆ రాజులు మనబోటి కర్షకులను దోచుకుంటుంటారు. శ్రీనాథుడు : మల్లన్నా! అది దోపిడీ ఏమిటి, వ్యాపారానికి లక్షణం. వాళ్ళు ధనవంతులు కాక పోతే దేశానికి వస్తు సంభారాలు వచ్చే వీలేలేదు. రాజులు ప్రజల మీద పన్నులు వేసి గ్రహించక పోతే పరిపాలనే లేకుండా అరాజకమైపోతుంది దేశం. మాచమ్మ : మల్లన్నా! ఎలాగైన మామను ఇవాళ పోనీయకుండా ఆపే భారం నీది. శ్రీనాథుడు : అక్కయ్యా! ఎందుకీ నిష్ఠూరం వృథాగా! రానా పోనా? మల్లన్న : అమ్మా! ఎలా పోతాడో చూస్తాను. నేను పొలం పని మానుకుంటాను. పోనీ రేపొతుంది. నీవు త్వరగా గంగకు వెళ్ళి రాపో మడికట్టు కుందువుగాని. మాచమ్మ : అబ్బాయీ, పొద్దున్నే మీ నాన్న పోతవరం వెళ్లారు. ఆయన వచ్చేలోపల మామయ్యకు మీ నాన్నగారు వ్రాసిన కవిత్వం వినిపించు తప్పులుంటే దిద్ది సరిచేస్తాడు. (బిందెతో గంగకు బయలుదేరుతుంది) శ్రీనాథుడు : మల్లన్నా! అనవసరంగా ఇక్కడ నేను ఆగిపోటమూ, అక్కడ మానెత్తిన తలకు మించిన బరువు కాచుకో కూర్చోటమూ. మల్లన్న : కొంత కాలంనుంచి మా నాన్నగారు భాగవతము ఆంధ్రీకరిస్తున్నారు. అది నీవు వినకుండా పోవటానికి వీలులేదు. 354 వావిలాల సోమయాజులు సాహిత్యం-2