Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక మనిషి నెత్తి మీద పెద్ద మేదర పెట్టె పూరి వసారాలో దించి వెళ్ళిపోతాడు. మాచమ్మ లోపలికి పోయి కాళ్ళకు నీళ్ళు తెచ్చి చెంబు వాకిట్లో పెడుతుంది. శ్రీనాథుడు ప్రవేశించి కుళాయి తీసి చిలక కొయ్యకు తగిలించి “ఒరేయ్. మీరు ఆ నీడలో కూర్చోండి" (నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటాడు).

మాచమ్మ : (నీళ్ల చెంబుతో) అబ్బాయీ! అక్కయ్య ఉన్నదనుకున్నావా - ఊడిందను కున్నావా?

శ్రీనాథుడు : ఏం మల్లన్నా! నాకంటే నీవే ముందు చేరుకున్నావే.

మల్లన్న : (గర్జితంగా) మీరు ఊళ్లో చూడవలసిన వాళ్లనందరినీ చూచివచ్చేటప్పటికి ఆలస్యమైనదను కుంటాను. నేను అడ్డదారిని త్వరగా వచ్చేశాను.

శ్రీనాథుడు : అక్కయ్యా! అల్లుడు బలే గట్టివాడే - మేము ఇద్దరమూ పొలిమేరలోనే కలుసుకున్నాం.

మాచమ్మ : ఏమో నాయనా మరి నీ పిల్ల వీడితో ఎలా నెగ్గుకోవస్తుందో - అయిదేళ్ళ నాడు నవమికి రావటమే తప్ప మళ్ళీ చీటి ముక్కైనా వ్రాశావు కాదు.

శ్రీనాధుడు : ఏదీ - నేను ఒకచోట స్థిరంగా ఉన్నదెప్పుడు? అమ్మ పోయినప్పటి నుంచీ మనస్థితి ఏమీ బాగాలేదు. కొంతకాలం దేశాటనం చేస్తే బాగుంటుందని కొండవీడు వదలి బెట్టాను.

మాచమ్మ : అయితే మా మేనగోడలు సరస్వతి ఎక్కడ ఉందిరా? దాన్ని ఒక మాటు తీసుకొచ్చి తలంటి పోసి పంపిద్దామంటే పడిందికాదు. పాపం తల్లి పోయిన పిల్ల. దానికి మాత్రం ఏ నూరుమంది ఉన్నారు.

శ్రీనాథుడు : అది వాళ్ల అమ్మమ్మ గారింట్లో ఉన్నది. దాన్ని చూచికూడా ఆరు నెలలు దాటింది. ఇదుగో అన్నిటికీ నేను దేశంలో లేక పోవటమే.

మాచమ్మ : నీవు ఎక్కడికో వెళ్ళేటప్పుడు పిల్లను అమ్మమ్మ గారింట్లో ఉంచకపోతే నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళకూడదూ! నీవు ఉంచకూడదా? మేము ఉంచుకోకూడదా? అవునులే - పెద్దవాళ్ళము పోషించలేము. పెద్దది ఆమె ఎప్పుడు పోయిందో నీకూ నాకు దూరమయినది.

(కంట తడి పెడుతుంది)


350

వావిలాల సోమయాజులు సాహిత్యం-2