మల్లన్న : మామగారూ! ఏ ఏ దేశాలు చూచారేమిటి?
మాచమ్మ : 'మామగారు' అదేమిటి 'మామ' అను నాయనా!
శ్రీనాథుడు : ఒక దేశమేమిటి? యావద్భారతమూ తిరిగి వచ్చాను. చూడని ఆస్థానమూ, ఆడని తీర్థమూ లేదు.
మాచమ్మ : మాటమాత్రమన్నా అన్నావు కాదురా. నీతోటి వచ్చి దేశమన్నా చూచేదాన్ని.
శ్రీనాథుడు : మహారాజులతో యాత్రకు బయలుదేరినవాణ్ణి 'నాకూ-నీకూ' ఎక్కడ కుదురుతుంది.
మాచమ్మ : నాయనా! అన్నిచోట్లా తీర్థవిధులు జరిగించావా.
శ్రీనాథుడు : అందులో లోపం చేస్తానా? అమ్మా నాన్నలకు ఏం కొదవని?
మాచమ్మ : వాళ్లకే కొదువాలేదు. ఉన్నన్నాళ్లు సుఖంగా బ్రతికారు. ఆ కన్నకొడుకు చేతిమీదుగా దాటి పోయినారు. ఒక్కడివైనా ఇంత పేరు ప్రతిష్ఠలలోకి వచ్చావు.
మల్లన్న : మామా! ఈ దేశాలన్నీ తిరిగేటప్పుడు ఎక్కడైనా నీకు మా అమ్మ గుర్తు వచ్చేదేనా?
మాచమ్మ : చూడు వాడి చమత్కారం. ఆటలు పట్టిస్తున్నాడు మామను.
శ్రీనాథుడు : మల్లన్నా! కంచిలో నీకు ఒక మంచి జరీ కుళ్లాయి కొన్నాను. కాశ్మీరంలో మీ నాన్నగారికి ఒక శాలువా పట్టుకొచ్చాను. మా అక్కయ్యకు ఏవో చాలాచోట్ల చాలా చీరెలూ రవికలూ పట్టుకొచ్చాను.
(మేదర బుట్టవైపు చూస్తాడు)
(దొడ్డిగుమ్మం తలుపు చప్పుడు)
మాచమ్మ : (శ్రీనాథుడితో) అబ్బాయీ అడుగో మీ బావగారు గంగ నుంచి మడి కట్టుకొని వచ్చి దొడ్డిగుమ్మం తలుపు తడుతున్నారు. తరువాత చూపిద్దువుగాని ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మడికట్టుకో (మల్లన్నతో) అబ్బాయీ మామను భావి దగ్గరకు తీసుకొని పోయి స్నానానికి నీళ్లు తోడి అందించు.
శ్రీనాథుడు : అల్లుడైనందుకు ఆ మాత్రం పరిచర్య చేయడూ? లేకపోతే పిల్ల నిస్తానా?
ఏకాంకికలు
351