Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాచమ్మ : గంగకు స్నానానికని వెళ్లారు మీనాన్న. ఇంతవరకు అతీగతీ లేదు. అదుగో కోదండరామ స్వామి ఆలయంలో అర్చన అవుతున్నట్లున్నది.

మల్లన్న : (విడ్డూరంగా) అది స్వామి ఆలయంలో నుంచి కాదు వినిపిస్తున్నది. మీ తమ్ములు శ్రీనాథ కవి సార్వభౌములవారి లాంఛనం. ఈమధ్య విజయనగరంలో కర్ణాటరాజు కనకాభిషేకం చేసి ఆయనకు ఇచ్చాడులే ఈ లాంఛనం.

మాచమ్మ : అయితే మావాడు కర్ణాటక చక్రవర్తిని కూడా ఎరుగునన్నమాట! చూచావా మామయ్య పేరెత్తితే ఒంటి కాలిమీద వస్తావు గాని వాడి వెంటపోతే ఇటువంటి గౌరవాలన్నీ మీ నాన్నకు చేయించడురా మా వాడు. వాడి పొళకువంటే గిట్టదాయె ఆ మనిషికి.

మల్లన్న : రాజులను ఆశ్రయించటానికి ఆయన మనస్సే అంగీకరించాలి గాని అప్పుడు మీ వాడూ అవసరం లేదు మా వాడూ అవసరం లేదు. అయినా మహాకవులు లాంఛనాల కోసం, రాజబిరుదాల కోసం కవిత్వం చెపుతారటమ్మా. ఏనాటికైనా మహారాజులే మా నాన్నగారి కోసం మన ఇంటికి రావలసిందేగాని ఆయన వాళ్ల దేవిడీ గుమ్మాలు దాటుతారా?

మాచమ్మ : చూస్తున్నాను గదా మల్లన్నా, ఎప్పుడు బట్టినా సరిగా ఆ తండ్రికి కొడుకువనిపిస్తావురా. డబ్బున్న వాళ్ళంటే గిట్టదు. డబ్బు సంపాదించటమంటే గిట్టదు. ఒక ముచ్చటా లేదు. అచ్చటా లేదు. ఎన్నాళ్ళూ కాపురం చేసినా కట్టుకోను ఓ మంచి బట్టా పెట్టుకోను ఓ నగ! మా వాళ్ళు పెట్టిన పులిచేరు అమ్ముకున్నారు గదా? ఈ పుస్తెలతాడూ నేను మూసివాయినాల ముత్తైదులాగా మిగిలాను.

మల్లన్న : (నవ్వుతూ) అయితే నేను ఒక మాట చెప్పనా? నేను తండ్రికి తగ్గ కొడుకునైతే నీవు అక్షరాలా ఆ తమ్ముడికి తగ్గ అక్కవేనమ్మా!

మాచమ్మ : తప్పేముంది. ఎవరి వాళ్ళలాగా వాళ్లుంటారు.

మల్లన్న : ఎలాగైనా మొదటినుంచీ మీ వంశం గొప్పదే.

మాచమ్మ : మీ వంశం ఇంకా గొప్పదిగా? అంతా బ్రహ్మజ్ఞానులు. ఉగ్గుబాలతోటే వేదాంతం రంగరించి పోస్తారు. మీ ఇంట్లో- (దూరాన శ్రీనాథుణ్ణి చూచి) అడుగోరా మామయ్య.


ఏకాంకికలు

349