Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లన్న : పాపం! మీ తమ్ముడు కేవలం శ్రీరామచంద్రమూర్తి - నీకేం తెలుసు దేశం ఏమని చెప్పుకుంటున్నదో మామను గురించి - పోనీ ఒక సంగతి ఆలోచించు. ఇన్ని ఆస్థానాలు తిరిగి, ఇంతమంది ధనికులను ఆశ్రయించి చేసిన సంపాదనంతా మీ తమ్ముడు కేవలం శ్రీశుకులే అయితే ఏం చేశాడంటావు.

మాచమ్మ : ఆఁ ఈలోకం చూచి వచ్చింది.

మల్లన్న : (ఉక్రోషంతో) లేదు. నన్ను చెప్పమన్నావా. లంకెబిందెలకేసి పడిపోయిన కొండవీటి కోటకొమ్మల్లో పాతేయించాడు - రాజమహేంద్రవరము నుంచీ అయ్యగారు ఎందుకు స్వస్తి చెప్పారో విన్నావో 'రన్ని' విషయంలో రాజుగారికీ ఈయనకూ రక్తపాతాలదాకా వచ్చిందట -

మాచమ్మ : పోనీ - నీవన్నట్లే అదంతా మనకెందుకొచ్చింది చెప్పు. మా నాన్నకు ఒక్కడైనా రత్నం. ఇంత వృద్ధిలోకి వచ్చాడు. పదిమంది పెద్దల్లో తిరగనేర్చాడు. తండ్రి తాతల పేరు నిలువ బెడుతున్నాడు. ఏంచేస్తేనేం. సంపాదనంతా ఏం చేస్తేనేం? నీకు పిల్లనిచ్చేటప్పుడు కట్నమివ్వలేక పోతాడనేనా నీ దిగులు, ఆ భయం పెట్టుకోకు.

మల్లన్న : పిల్లిని చంకన వేసుకొని తిప్పినట్లు ఊరూరా పిల్లను తిప్పుతున్నాట్ట. పట్టణాలల్లో నిముషానికి ఒక కొత్తపోకడతో సింగారించుకుంటూ సీతాకోక చిలుకలాగా పెరిగే ఆ అమ్మాయిని అంటగట్టుకుంటే మన కాపురం నెగ్గినట్లే.

మాచమ్మ : అయితే మేనరికం పోగొట్టుకుంటాముట్రా.

మల్లన్న : 'నందోరాజా భవిష్యతి' - ఇప్పుడెందుకా విషయం.

మాచమ్మ : వాడే వస్తే ఈ తడవ వచ్చే కార్తికమాసంలో ముహూర్తం పెట్టించమని అడుగుదామనుకుంటున్నాను.

మల్లన్న : అప్పటికిమల్లె మనకు డబ్బువస్తుందా ఏం?

మాచమ్మ : అంతగా మనకు అప్పటికి రాకపోయినా లేకపోయినా మనకయ్యేది కూడా వాడే ఎక్కడనో తెచ్చిపెడతాడు.

మల్లన్న : అంత ఖర్మం మనకేం పట్టింది. భూదేవి చల్లగా చూడాలిగాని. నవ్విన మన నాపచేనే పండదుటే-

(కాహళధ్వని ఒకటి వినిపిస్తుంది)


348

వావిలాల సోమయాజులు సాహిత్యం-2