Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్లన్న : నన్ను దూరాన్నేజూచి గుర్తుపట్టి సగర్వంగా మేనా ఆపించి పగటిదివ్వె వెలిగించమన్నాడు. ఒక పడుచు కోయపిల్ల దారిన పాడుకుంటూ పోతుంటే పిలిచి ఒక మాడ విసిరి పారేశాడు నాకు కనబడేటట్లుగా.

మాచమ్మ : వాడు రమ్మనకపోతే మాని, నీవైనా పోయి 'ఎక్కడినుంచి మామా' అని పలకరించక పోయినావా?

మల్లన్న : ఎందుకు పలకరించాలేం? నేను మటుకు తక్కువ తిన్నానా? ఆయన గొప్ప ఏమిటో కొంచెం చెపుదూ వింటాను - లేదని ఎందుకనాలి. ఉంటే ఆయన్నే ఉంచుకోమను.

మాచమ్మ : అనవసరంగా ఎందుకురా ఇంత ఉక్రోషం. నిన్నేం తక్కువ చేశాడని.

మల్లన్న : అవమానించటానికి యత్నించాడు.

మాచమ్మ : నిన్నేమన్నా మాటన్నాడా?

మల్లన్న : మాటనకపోతే సరా! నా దారిని నేను పొలం దున్ను కుంటుంటే ఇష్టముంటే మర్యాదగా పిలిచి మాట్లాడాలి లేదా తన దారిని తాను పోవాలి. వెర్రిడాంబికం నా దగ్గరనా. చూడు నా ప్రజ్ఞ అన్నట్లుగా మేనా బోయీలను ఒకవైపు మానేయించి నడిపిస్తాడా!

మాచమ్మ : నడిచిందిరా మేనా నాయనా? ఈ విద్యంతా వాడికి మీ నాన్న నేర్పిందేలే!

మల్లన్న : నాకూ మానాన్న నేర్పలేదు మరి. నేను మటుకు ఊరుకున్నానా? అరక ఎద్దును ఒకదాన్ని ఒదిలిపెట్టి పొలం దున్నించాను.

మాచమ్మ : ఆయనకు అన్ని మంత్రాలు రాబట్టేనా ఇలా ఉన్నాము - అయితే అరకవైపు మామ చూచాడా?

మల్లన్న : ఆఁ చూచి, బోయీలను రెండోవైపు కూడా విడిచి పెట్టమని మేనా నడిపించాడు.

మాచమ్మ : తరువాత నీకేం చెయ్యాలనో తెలియలేదుగామాలి.

మల్లన్న : అబ్బా! ఈపాటి క్షుద్రశక్తికే భయపడ్డాననుకుంటున్నావేం, ఒక్కమాటు భూదేవిని మనస్సులో స్మరించి రెండో ఎద్దును కూడా వదిలిపెట్టి అరక నడిపించాను - ఊరుకుంటానా మరి.


346

వావిలాల సోమయాజులు సాహిత్యం-2