Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలరాజు : బ్రహ్మన్నమంత్రుల వారికి సమాధానం లేకపోలేదు.

నాగమ్మ : (కటుగ్గా) ఏమిటది?

అలరాజు : (ప్రశాంతముగా) మలిదేవాదులకు అర్ధరాజ్యం బ్రహ్మన్న మంత్రులవారు అడగటంలో వారు అలుగురాజులుంగారి కుమాళ్ళని కాదు. మీరు పుట్టకపూర్వమే అలుగు రాజులుంగారు బాదన్నను పెంచుకొని ఇచ్చిన అర్ధరాజ్యం ఆయన స్వర్గానికి వెళ్ళేటప్పుడు మమకారం చేత మలిదేవాదులకు ఇచ్చి పోవటంవల్ల.

నలగామ : ఆ బాదన్నగారికి నేను సజీవుడనై ఉండగా అటువంటి అధికారం ఉండదు.

నాగమ్మ : అవును ప్రభూ! ఈ సమస్త దేశానికీ రాజ్యాధికారం మీదే. ఈనాటికైనా మీరు గ్రహించారు నా మాట.

అలరాజు : ఆ పక్షంలో ఈ సమస్త రాజ్యం మీదా మీకు ఏ విధమైన అధికారమూ లేదని బ్రహ్మన్న మంత్రులవారి ఆక్షేపణ.

నాగమ్మ : (నిష్కర్షగా) ఎట్లా?

అలరాజు : మైలమమహా దేవులుంగారు వెలనాటి వారి ఆడబడుచు. వారికి ఈ రాజ్యం అరణంగా వచ్చింది. వెలనాటివారు కళ్యాణీ చాళుక్య వీర సోమేశ్వరుల వారికి సామంతులన్న సంగతి మరిచిపోవద్దు. బ్రహ్మన్న మంత్రులవారు సోమేశ్వరులవారి కుమార్తెను మలిదేవుల కిప్పించి వివాహం చేయించారు. ఆ సమయంలో ఈ సమస్త రాజ్యమూ చక్రవర్తులే కుమార్తెకు అరణమిచ్చారు. అయినా బ్రహ్మన్నమహామంత్రుల వారు రాజ్యాన్నంతా మలిదేవులవారి కిమ్మని మిమ్మల్నికోరటం లేదు. అర్ధరాజ్యాన్ని ఇస్తే అంతటితోటే వారిని తృప్తి పరుస్తామంటున్నారు. వారి మాటలకు మలిదేవరాజులుంగారూ ఎగర్తించరు.

నాగమ్మ : (చల్లగా) ఒకవేళ ఇవ్వకపోతే?

అలరాజు : ఏం జరుగుతుందో మీరే నిర్ణయించుకోండి.

నరసింహ : యుద్దంతప్ప జరిగేది ఏముంది? ఆ క్రింద భూమీ, పైన ఆకాశమూను.

నలగామ: అర్ధరాజ్య మివ్వట మనేది పొసగదు.

అలరాజు : అంత అక్రమానికే వస్తే అవహం తప్పదన్న మాటే. ఒకమాట. అధికారం లేని రాజ్యాన్ని అంతా కబళిద్దామనుకోవటం దురాశ కదూ!


32

వావిలాల సోమయాజులు సాహిత్యం-2