నలగామ : అలరాజా! వచ్చిన పని ఇక బయట పెట్టడం మంచిది.
అలరాజు : తమకంతా ఇది వరకే నివేదించాను. తమరే ప్రారంభించటం సమంజసం.
నలగామ : (సిద్ధపడి) మహామంత్రిణీ! అలరాజు ఇప్పుడు అల్లుడు కాదు, రాయబారి.
నాగమ్మ : సంతోషము ప్రభూ, తమ అల్లుడుగారు ఇంతవారయినారు. తమ మీదికే -
నలగామ: వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకివ్వమని -
నరసింహ : (అదిరిపడి) అర్ధరాజ్యమా! అడుగైనా ఇవ్వటానికి వీలు లేదు.
నాగమ్మ : మొదట్లో మోసం చేసి అర్ధరాజ్యం పుచ్చుకున్నారు. కోడి పందెంలో మోసానికి ప్రతిమోసం చేసి పుచ్చుకున్నాము. ఆ మాటకు వస్తే అర్ధరాజ్యానికి వాళ్ళకు అధికారమే -
నలగామ : మా తండ్రి కడుపున పుట్టడమే అధికారము.
నాగమ్మ : ఈ రాజ్యం అలుగు రాజులుంగారికి ఎలా సంక్రమించిందో కొంచెం ఆలోచించండి.
నలగామ: మా తల్లి మైలమమహాదేవులుంగారికి మా మాతామహులు అరణంగా ఇచ్చారు.
నాగమ్మ : అయితే వాళ్ళకు అధికారం లేదన్నమాటలో తప్పు లేదుగదా!
నలగామ : రాజ్యమంతా తల్లి గారి మూలంగా మా తండ్రి గారికి సంక్రమించింది. తండ్రి ఆస్తిని కొడుకులు సమానంగా పంచుకోవటం రాజనీతి కాదేమోగాని అసమంజసం కాదు గదా!
నాగమ్మ : అవును. మంచిదే.
అలరాజు : సంతోషము - సంతోషము.
నాగమ్మ : అయితే నరసింహరాజులుంగారికి కూడా మూడో వంతు పంచి పెట్టవలసి వస్తుంది.
నరసింహ : ప్రభువులవారు అలా చేయని అధర్మపరులా మరి.
నలగామ : (సందేహంలో పడ్డట్లు) అలరాజూ! దీనికి ఆ బ్రహ్మన్న ఏం సమాధానం చెపుతాడు?
నాయకురాలు
31