చంద్రశేఖరం : మన కష్టమంతటికీ వెనక ఒక వ్యక్తి ఉన్నాడన్న సంగతి మీరు గమనించారా?
భుజంగం : ఆ చైతన్యంగాడేనా? వాడిమొఖం! - మనను దెబ్బకొట్టటం వాడి తాతతరం కాదు. అనవసరంగా వాడికి ఖ్యాతి తెచ్చిపెట్టవద్దు.
చంద్రశేఖరం : తెరవెనుకనుంచి మనమీద నాటకమాడిస్తున్నది వాడే.
భుజంగం : పుణ్యకోటిని కౌంటరు ప్రాపగాండాకు పెట్టాముగా.
చంద్రశేఖరం : బ్రహ్మాండంగా కష్టపడుతున్నాడు. ప్రయోజనం కనిపించటంలేదు.
భుజంగం : 'జయని’ ఇస్తానని ఆశపెట్టలేదు. ఆ మాటంటే ఇంకా ఒళ్లు విరుచుకొని పనిచేస్తాడు.
చంద్రశేఖరం : అందువల్లనే అంత కష్టపడటం! మీరు ఇస్తారనే ఆయన నమ్మకం. అయితే జయ మారిపోతున్నది. పుణ్యకోటి మాట చెపితే మండి పడుతున్నది - చైతన్యమంటే కించిత్తు అభిమానం కూడా ఆమె మనస్సులో ఏర్పడుతున్నట్లుంది మీ శత్రువుకు ఆమె హృదయంలో స్థానం దొరుకుతున్నది.
భుజంగం : చిన్నపిల్ల! దానికో నిశ్చితాభిప్రాయమేమిటి?
చంద్రశేఖరం : ఎలాగైనా చైతన్యం ప్రజాదరణ పొందుతున్నాడు. మన డబ్బు తినేవాళ్ళే మనగుట్టు వాడికి మోసేస్తున్నారు. లేకపోతే మన మెడికల్ హాల్ తరఫున బోర్డుకు సప్లై చేసిన మందుసీసాలల్లో శివుడుబావి నీళ్ళని వాళ్ళకెలా తెలిసింది - నిన్ననే ప్రభుత్వానికి ఊళ్ళోనుంచి పిటిషన్ వెళ్ళిందట! మీ పేర ఎన్ని దొంగసంస్థలున్నవో అందులో వ్రాశారట!
భుజంగం : అయితే చైతన్యం నాకు ప్రబలంగా ప్రత్యర్థి అవుతాడన్నమాట!
చంద్రశేఖరం : ఇంకా సందేహిస్తారేం? ఎన్నడో అయినాడు.
భుజంగం : మెడికల్ హాల్ బాకీకి నోటు వ్రాసి ఇచ్చి ఇల్లు తాకట్టు పెట్టినట్లున్నాడు? దావా చేసి కొంప వేలం వేయిస్తాను, రిమ్మ అణుగుతుంది.
చంద్రశేఖరం : మీతో పగంటే పాము పగని వాడికి తెలిసి రావాలి. మనమూ ఒక పిటీషన్ పారేద్దాము. డాక్టర్లను జాతీయం చెయ్యమని, లేకపోతే చైతన్యం వంటివాళ్ళ దోపిడీకి ప్రజలాగలేరని. ఎంక్వయిరీ వస్తుంది. మన కాళ్ళమీద పడతాడు.
డాక్టరు చైతన్యం
263