Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావు : నిజమే మరి? అది మన ఇష్టంలో లేదు.

రంగడు : అయితే మీరంతా సేతగానోళ్ళు. మా వూళ్ళో ఒక్క యెదవ అబద్ధం సెప్పిండో ఆడికి మళ్ళీ కూడుపుట్టకుండా సెయ్యంటయ్యా! మీకు కూడా అట్టా సేస్తే మర్నాటికల్లా మాటినరండి. సరేగానీ భుజంగం వంటి డబ్బున్నోళ్ళంతా మిమ్మల్ని కొనేస్తారంటగా?

రావు : మమ్మల్ని కాదుగానీ మా పేపరు పెట్టినవాళ్ళనే కొనేస్తారు.

రంగడు : అంటే అదే గదంటయ్యా! వాళ్ళనుకొంటే మిమ్మల్ని కొన్నట్లేగా. బర్రెను కొంటే దూడను కొన్నట్లే. ఓరి ముసలయ్యా!

(ప్రవేశము ముసలయ్య) ఈనెవరో పేపరాయనంటగాని, పట్టుకో బోదాంపా! ఏందేందో రాసుకోపోతున్నాట్ట!

రావు : (భయపడుతూ) నన్ను పట్టుకుపోతే ఏముంది? మావాళ్ళు ఎలా వ్రాయమంటే అలా వ్రాస్తాము.

ముసలయ్య : (దగ్గరికి వస్తాడు) మిమ్మల్ని పట్టుకుంటే యిడిపించను మీవాళ్లు వస్తారు. - వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఇడిపిస్తాములే. ఆఁ

రావు : ఇది చాలా ప్రమాదం!

రంగడు : అవును నీకు ప్రమాదం కాదంటయ్యా మరి -

రావు : మాకు ప్రమాదమైతే నాలుగురోజులు జైల్లో పెడతారు. అంతేనా?

ముసలయ్య: పోనీ అబద్ధాలు రాయనని ఒట్టెట్టుకో నిన్ను ఒదిలిపెడతాము.

రావు : (తప్పనిసరైనట్లు నటించి) అబద్ధాలు వ్రాయను.

ముసలయ్య : చైతన్యంగారిని గురించి మంచిగా వ్రాస్తామని మా ముందు దణ్ణం పెట్టి చెప్పు.

రావు : తప్పకుండా! (దణ్ణం పెడుతూ) నా దేవుడి సాక్షిగా చైతన్యంగారిని గురించి అబద్ధం వ్రాయను అబద్ధం వ్రాయను.

రంగడు : మహానుభావుడని వ్రాస్తాను.


252

వావిలాల సోమయాజులు సాహిత్యం-2