Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికరణకుడు : ఇష్! (చారుదత్తునితో) అయ్యా నిన్న సాయంత్రం వసంతసేన మీ ఇంటినుంచి నడిచివెళ్ళిందా? లేక బండిలో వెళ్ళిందా?

చారుదత్తుడు : నేను ఇంట్లో ఉన్నంతవరకు ఎక్కడికీ వెళ్ళలేదు. తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు.

అధికరణకుడు : ఆమెను ఎవరో హత్యచేసి జీర్ణోద్యానంలో పారేశారన్న సంగతైనా తెలుసునా?

చారుదత్తుడు : ప్రియా! వసంతసేనా!

(*) లేత వెన్నెలలకు సొగసీయ నేర్చిన దంతకాంతితో, మావిచిగుళ్ల విలాసాలతో ఓప్పే కావిమోవితో ఇంపెసలారిన నీ ముఖకాంతిని త్రాగి నేడేరీతిగా ఈ అపకీర్తి విషాన్ని క్రోలగలనో కదా!

శకారుడు : ఇంత రభసెందుకు? - హత్య చేశానని అంగీకరించు.

(అధికరణకునితో) ఇంకా అనుమాన మేమిటయ్యా!

చారుదత్తుడు: నా దారిద్య్రలక్షణాలల్లో ఇదీ ఒకటి? తేనెలో మాగిపోతూ ఉన్న పూలమీదికి తుమ్మెదపిండ్లు బారులు కట్టి వచ్చేటట్లు ఆపత్కాలంలో లోపాలు అనంతంగా నన్నావరిస్తున్నవి.

అధికరణకుడు : చారుదత్తయ్యా! సత్యమేమిటో త్వరగా బయట పెట్టండి.

శకారుడు : వ్యవహార విషయంలో మీకింత పక్షపాతం పనికిరాదు. ఒకవంక హత్య చేశాడని స్వచ్ఛంగా నిరూపితమౌతుంటే ఇంకా ఏమిటా గ్రుచ్చి గ్రుచ్చి అడగటం - ఉఁ. తీర్పు చెప్పండి - ఇంకా ఆ స్త్రీ ఘాతుకుడికి ఆసనమిచ్చి గౌరవించటమెందుకు? లెమ్మన రేం?

చారుదత్తుడు : (ఆసనం మీదనుంచి లేచి నిలువబడతాడు).

శకారుడు : హిఁ హిఁ హిఁ - (అతను వదిలిన చోటు ఆక్రమించి) చారుదత్తా! నేనే చంపానని నీ నోటిమీదుగా ఒకమాటు -

మైత్రేయుడు : (హఠాత్తుగా ప్రవేశించి) చారుదత్తా! చారుదత్తా!! నిన్నిక్కడికి రప్పించినదెవరు? కారణం?


వసంతసేన

195