మదనిక : అక్కా! నీ ఒంటిమీద కెక్కి ఈ ఉత్తరీయం అందం తెచ్చుకున్నది.
వసంతసేన : పొరబాటు. చారుదత్త మహాభాగుల ఉత్తరీయాంశుకంవల్ల నా శరీరానికి నూతనోత్తేజం కలిగింది. మదనికా! వారి సేవకుడికి కంకణమిచ్చి మానం నేను కాపాడినందుకు నా సేవకుణ్ణి ఈవిధంగా ఆర్యుడు తెలియ కుండానే గౌరవించాడు.
మదనిక: అదేమిటి?
వసంతసేన : ఇప్పుడే అప్పుపడ్డ ఆర్యుల సేవకుడికి పది సువర్ణాల కంకణమిచ్చి ఋణవిముక్తుణ్ణి చేశాను.
మదనిక : (నవ్వుతూ వసంతసేన కప్పుకున్న ఉత్తరీయం సవరిస్తూ) అక్కా! ఇది నీవు వ్యయం చేసిన పదిసువర్ణాల కంకణం విలువ వుంటుందా?
వసంతసేన : నీ మొగుడు వారింట్లో దొంగిలించిన భూషణ పాత్రకంటే ఎన్నో రెట్లు విలువ చేస్తుంది. (అని అంజలి ముడిచి వాసన చూస్తూ ఉంటుంది) అమ్మాయీ! మనం త్వరగా అలంకరణ పూర్తి చేసుకొని ఆర్యచారుదత్తుల ఇంటికి బయలుదేరాలి రత్నహారం వెంటతీసుకోవెళ్ళాలి. మరిచిపోవద్దు. జ్ఞప్తి ఉంచుకో (ఉరుములు మెరుపులు)
మదనిక: అక్కా! అటుచూడు! అకాలదుర్దినము. కారుమేఘాలు బాగా క్రమ్ముకోవస్తున్నవి-
(వాతాయనంవైపు నడిచి) కుంభవృష్టి తప్పదు.
వసంతసేన : (*) మదనికా! ఈ శ్రావణపయోదాలు లోకాలకు ప్రళ యంగా కుంభవృష్టి కురియనీ. నేల బీటలు వారేటట్లు పిడుగులు పడనీ, ఏమైనా రమణీయాకృతితో నేను నా ప్రియుని ఇంటికి వెళ్ళి తీరవలసిందే!
మదనిక: అక్కా! ప్రవాసంనుంచి తిరిగివచ్చే ప్రియులకు వాసకసజ్జికలు స్వాగతమిచ్చినట్లు, అదుగో, అటుచూడు! ఆ గిరిశృంగాలమీద మయూరాంగనలు పురులు విప్పి మధుర క్రేంకారాలతో అంబుదస్వామికి ఎలా స్వాగతమిస్తున్నవో!
వసంతసేన : అయ్యో! దిక్కులన్నీ పట్టపగలే కారుచీకట్లలో కలిసి పోతున్నవి. జగత్తుకు ఇక ఈ దినం భయంకర కాళరాత్రేనా? ప్రళయం రానీ! నా ప్రయత్నం మానను!!
———————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2