మదనిక: వస్తున్నానక్కా!
వసంతసేన : (మదనిక రాగానే) ఎవరిదా గొంతు - ఎక్కడనో విన్నట్లున్నాను.
మదనిక : అది మన చారుదత్తులవారి మిత్రుడు శర్విలకులది కదూ!
వసంతసేన : (ఎరగనట్లు నటిస్తూ) శర్విలకులు!
మదనిక: అదేమిటక్కా! - అప్పుడే మరచిపోయినావా? ఆయనను ఆ దినం చారుదత్తులవారి ఇంట్లో... నీవు నాట్యం చేస్తుంటే -
వసంతసేన : (మళ్ళీ తలుపుచప్పుడు విని) పోనీలే -మరిచిపోయినానేమో - ఎందుకువచ్చారో - త్వరగా తీసుకోరా!
మదనిక: (శర్విలకుడిని తీసుకోరావటం కోసం నిష్క్రమిస్తుంది)
వసంతసేన : (ఆతురతతో వెళ్లుతున్న మదనికను చూచి చిరునవ్వు నవ్వి) జాణవంటే నీవేనే మదనికా! పాపం! మావిగున్ననీడలో మీరిద్దరూ చేసిన సంభాషణంతా నేను గమనించలేదనుకున్నావు గామాలి. స్నిగ్ధనేత్రాలతో కడుపార అతని సౌందర్యాన్ని త్రాగిన కళ్ళలోని ప్రేమప్రసన్నతంతా మటుమాయం చేసి ఎంతలో ఎంత చిత్రంగా నటించావే! శర్విలకుడు చారుదత్తుల మిత్రులా! నీవు నిజంగా నర్తకివే!
మదనిక: (ఆదరం నటిస్తూ) ఆర్య శర్విలక! ఇటు, ఇటు
శర్విలకుడు : (ప్రవేశిస్తూ) అమ్మాయీ! శుభము!
వసంతసేన : (సగౌరవంగా లేచి) ఆ ఆసన మలంకరించండి -
శర్వీలకుడు : నన్నప్పుడే మరిచిపోయినట్లున్నారు.
వసంతసేన : (జ్ఞప్తికి తెచ్చుకుంటున్నట్లు నటించి) మరిచిపోవటమేమిటి? మీరు చారుదత్తులవారి -
శర్విలకుడు : ఔను, అతని మిత్రుణ్ణి.
వసంతసేన : ఏదో పెద్దపని పెట్టుకొని వచ్చినట్లున్నారు. (నగల పాత్రిక వైపు చూస్తుంది)
శర్వీలకుడు : (లోపలినుంచి బయటకువస్తూ) మిత్రుడు చారుదత్తుడు మీకు ఇది భద్రంగా చేర్చి రమ్మన్నాడు. వాళ్ల ఇల్లు చాలా పాతదైపోయింది. అందులో పట్టణంలో దొంగలు ఈమధ్య ప్రబలిపోయినారు - ఎన్నాళ్లకూ మీరు మళ్ళీ అడిగి పుచ్చుకోలేదట.
———————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం - 2