మదనిక: ఆర్యచారుదత్తుల పరిచయం నీలో కళామూర్తిని జాగృతం చేసిందక్కా! పవిత్రప్రణయం వల్ల ప్రపంచంలో కళాస్రష్టలు ఎంతోమంది జన్మిస్తారనటానికి నీవు...
వసంతసేన : నిదర్శనమా! బాగుంది చారుదత్తుల రూపాన్ని చిత్రించటంమంటే సామాన్యం కాదే! (చిత్రపటాన్ని చూస్తూ) మహాభాగా!
(*) ఓ కమనీయరూపా! మీ శరీరవిలాసాన్ని ఏ శిల్పైనా ఎలా చిత్రించగలడు? ఒకవేళ చిత్రించినా మీ కరుణాన్విత హృదయాన్ని భావనకూడా చేయలేడు. మదనికా! నా కేమిటీ ఆనందం - అనుభవించలేకుండా ఉన్నాను... ఏమిటో తెలియటం లేదు వివశనై పోతున్నాను. ఏది ఆ కుంచె (చేతికి తీసుకొని)
(లోపల మదనికా! మదనికా!!)
మదనిక : అక్కా, నన్ను అమ్మగారు పిలుస్తున్నారు.
వసంతసేన : (పొమ్మన్నట్లు సంజ్ఞ)
మదనిక : (వెళ్ళిపోతుంది)
వసంతసేన : (కూనిరాగం తీసుకుంటూ చిత్రాన్ని చూచి మురిసిపోతూ మధ్యమధ్య గీతానికి అనుగుణమైన నృత్యం చేస్తూ)
ప్రేమమయా! ప్రణయసఖా!!
ప్రణయపతీ! ప్రాణపతీ!!
చపలనురా, జలధరుడా!
చంద్రుడవు, చంద్రికను
రసికుడవు, రాగిణినీ!
నర్తకిని, నాయకుడా!
మధువునురా, మధుకరుడా!
నౌకనురా, నావికుడా!!
ప్రేమమయా! ప్రణయసఖా!!
ప్రణయపతీ! ప్రాణపతీ!!
(చిత్రాన్ని ముద్దు పెట్టుకోబోతుంది. తలుపు చప్పుడు)
——————————————————————
149