మదనిక : ఇంకా ఏం చెప్పమంటావు, చెపితినిగా.
వసంతసేన : ఏం చెప్పావు? - పోనీ ఈ చిత్రం ఎలా ఉందో చెప్పు-
మదనిక : (పూర్వవిధంగా) నీకోరిక తీర్చటానికి... నిశ్చల ప్రేమతో... నిర్మల హృదయంతో - పురివిప్పి నిలచిన నెమలిలా - పురుష పుంగవుడు అలంకరించుకొని ఆర్యచారుదత్తులు వచ్చి కూర్చున్నట్లున్నది. (నవ్వుపుట్టించే టట్లుగా) అక్కా ఆ భంగిమలో ఆర్యుల కన్నులనుంచి అమృతవృష్టి కురుస్తున్నట్లున్నది.
వసంతసేన : ఆర్యుల కరుణారసప్రదనేత్రాలను కమనీయంగా చిత్రించానా?
మదనిక : నీకు అనుమాన మెందుకు, నేను చెప్పటమెందుకు? నీ కుంచె ఆవిశాలశతపత్రనేత్రాల మీదికి పోకపోవటమే చెప్పుతున్నది.
వసంతసేన : (నవ్వి) వారి విశాలవక్షఃప్రదేశానికి లోపం -
మదనిక : ఊఁః - అణుమాత్రం రాలేదు - అయితే నీ గాఢాలింగన కౌతూహలం నీచేత మరింత కర్కశంగా చిత్రించేటట్లు చేయించిందేమోనని అనిపిస్తున్నది.
వసంతసేన : (కుంచెతో ఒక చుక్కపెట్టి) ఇప్పుడో!
మదనిక : ఆఁ. ఆయన సహజరూపం. చక్కగా సరిపోయిందక్కా! ఒక మాటు లోపలికివెళ్లిరా, నీవే వారనుకోని పలకరిస్తావో లేదో!
వసంతసేన : ఇచ్చకాలాడకు, మదనికా! చిత్రం నీకు ఎక్కడ నచ్చక పోయినా చెప్పు.
మదనిక : (పరిహాసం మాని నిశ్చలంగా) మనస్ఫూర్తితో చెప్పుతున్నాను. ఇందాక నీవు చేసిన మార్పుతో -
వసంతసేన : (అనునయిస్తూ) మార్పుతో,
మదనిక : నేను చెప్పటమెందుకులే!
వసంతసేన : పోనీలే -
మదనిక : అక్కా! నీ కర్ణమైందో లేదోగాని నీ హృదయం కూడా లగ్నమైంది.
వసంతసేన : (పటాన్ని చూచి మురిసిపోతూ) చిత్రాలు గీయటం ప్రారంభించి చివరకు ఏడాది కూడా కాలేదు గదా! అప్పుడే ఇంత సజీవ చిత్రాన్ని సృజించగలిగానా?
——————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2