Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైత్రేయుడు : ఆ నగలపాత్ర మనది కాదని, చారుదత్తుడే తాతతండ్రులు లంకెబిందెలు వేసిన పాతరలు త్రవ్వి అంత ధనం వసంతసేనకు అచ్చి యిస్తాడని. వ్యాపారంలో మొన్నటి దెబ్బతో మనకు మిగిలింది 'అశ్మాచమే మృత్తి కాచమే' కదా!

చారుదత్తుడు : విధీ! నన్ను ఎంతకు తీసుకోవచ్చావు? సృష్టిలో లేని నూతన దారిద్ర్యాన్ని సృజించి నామీద ప్రయోగించావు. తన నీడను తానే నమ్మలేని వారవనితల వంశంలో పుట్టిన వ్యక్తికి నామీద నమ్మకం కలిగించావు. ఆమె హృదయంలో ప్రఖ్యాతదరిద్రుడనైన నామీద అనురాగబీజాలు విత్తి మొలకలెత్తిస్తున్నావు. ఈనాటి గాథతో నన్ను జీవచ్ఛవాన్ని చేయటానికి స్థిర సంకల్పుడవైనావా?

మైత్రేయుడు : చారుదత్తా! ఎందుకు నీకీ లేనిపోని పిరికితనం. నేను ఒక మంచి ఎత్తు ఎత్తుతాను. వసంతసేన వస్తే నువ్వు మెదలకుండా కడుపులో చల్ల కదలకుండా కూర్చో! - ఆమె నగలపాత్రను గురించి ప్రశ్నిస్తూ, ఆపైన ఒక నాటకమాడతాను. చూడుమరి నా సత్తా.

చారుదత్తుడు : ఏమిటా నాటకం ?

మైత్రేయుడు : ఏముంది - అడగంగానే ఇచ్చినవాళ్ళెవరు? పుచ్చుకున్న వాళ్ళెవరు? చూచిందెవరు? అని గుక్క తిప్పుకోకుండా ఘనా, జటా చెప్పి గల్లంతు చేసి పంపించేస్తాను.

చారుదత్తుడు : అనుభవిస్తున్నది చాలక అబద్దం కూడా ఆడమన్నావా?

మైత్రేయుడు : నీవు అబద్ధమాడినట్లేలా ఔతుంది? మాట్లాడకుండా బెట్టుగా కవిరాజులా కలం పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ ఆలోచించుకుంటూ కూర్చో.

చారుదత్తుడు : మైత్రేయా! మౌనం అర్ధాంగీకారం. అబద్ధం ఆడలేను. నగలకు తగ్గ విలువైనా వసంతసేనకు ఇచ్చివేయవలసిందే -

మైత్రేయుడు : ఎక్కడినుంచి తెచ్చి?

చారుదత్తుడు : (స్థిరకంఠంతో) క్షేత్రాలు చేసి, పది పట్టణాలు ముట్టెత్తి.

మైత్రేయుడు : 'అగ్నేయంతి ద్రవిణం భిక్షమాణాః' అని శ్రుతి. దాని కలవాటు పడితే దారిద్ర్య మెక్కడుంది? బ్రాహ్మణజాతికి వేదాలు విధించిన జీవనమే అది. దాన్ని సక్రమంగా సాగించుకున్నన్నాళ్ళూ ఎంతెంత మహారాజులూ వచ్చి మన పాదాలమీద పడి సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. ఇప్పుడో కాలమే మారిపోయింది.

———————————————————————————

138

వావిలాల సోమయాజులు సాహిత్యం-2