మైత్రేయుడు : (అస్తావిస్తంగా లేచి) ఆఁ - దొంగను తవ్వి కన్నం పారిపోతున్నదా? పట్టుకో, పట్టుకో! అయితే కన్నం మొన్న మనం పులుసు కాచుకున్న గుమ్మడికాయంత ఉందా!
రదనిక : బాబయ్యా! కొంప గుణ్ణం వేసుకోపోతుంటే ఏమిటా పరిహాసం! అదుగో!
మైత్రేయుడు : (గుమ్మంవైపు చూస్తూ) చారుదత్తా! దొంగ! దొంగ!!
రదనిక: అమ్మా! అమ్మా!! (నిష్క్రమిస్తుంది).
చారుదత్తుడు : (నెమ్మదిగా లేస్తూ) ఏమిటీ హడావుడి, మైత్రేయా?
మైత్రేయుడు : ఏమిటేమిటి? - అటు చూడు. దొంగ కన్నం తవ్వాడు (నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని) అవ్వ! వీడి ముండమొయ్యా! వీడి ముండమొయ్యా!! ఎంత కన్నం తవ్వాడు! ఎంత కన్నం తవ్వాడు!! తన కొంపకు తవ్వుకోలేకపోయినాడు.
చారుదత్తుడు : (కన్నంవైపు చూచి తాపీగా) మైత్రేయా! దొంగ ఎవరో కాని మంచి నేర్పరి!
మైత్రేయుడు : నేర్పరా! వాడిపాడా! ఎవడో కొత్త క్షేప! మన ఇంటికి కన్నం వేసి వాడేమి బాముకుందామని.
చారుదత్తుడు : నేర్పరి కాడనటానికి వీలులేదు. చోరకర్మకు శాస్త్ర కర్తలు కనకశక్తీ, కార్తికేయులూ చెప్పిన లక్షణాలన్నీ తెలుసుకొని తవ్వాడీ కన్నం!
మైత్రేయుడు : బాగుంది, మన చదువు సంధ్యలు ఇందుకైనా ఉపయోగించినవి - అయితే చోరకర్మకూ ఒక శాస్త్రముందా? - మన ఋషులు దానికీ ఒక శాస్త్రమేడిచారూ? క్షురకర్మకూ ఒక శాస్త్రము ఏడవలేకపోయినారూ, గాలి మేసి గడ్డాలు పెంచుకొని పనిలేకపోతే సరి.
చారుదత్తుడు : (మందస్మితంతో) ఆ పనికి నీవు బ్రహ్మర్షి వైన తరువాత పూనుకో.
మైత్రేయుడు : (ఉద్రేకంతో) మొదట వాళ్ళ గడ్డాలు చెక్కించి మడ్డి వదిలిస్తాను.
చారుదత్తుడు : (కన్నంవైపు చూస్తూ) దొంగ పాపం! ఎవరో పొరుగూరివాడై ఉంటాడు. ఉన్నవాళ్ళమని ఉర్రట్లూగుతూ వచ్చి ఉన్న సత్తువంతా గోడలు త్రవ్వటానికి పెట్టి ఉత్తచేతులతో ఉదయం ఇంటికి చేరుకుంటాడు గామాలి. తెల్లవారిన తరువాత
————————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2