శర్విలకుడు : (మందగమనంతో ప్రవేశించి దీపం పెద్దది చేసి ) కార్తికేయా! కనకశక్తీ!! (రెండడుగులు ముందుకు వచ్చి) మంచి నిద్రలో ఉన్నారు. (మద్దెలమీద చిన్న దెబ్బకొట్టి) నాట్యాచార్యుడి ఇల్లా ఇది! (వీణ పిల్లనగ్రోవి సవరిస్తాడు) ఇంటి గొప్ప చూచి ఎంత మోసపోయినాను. ధనమేమైనా భూస్థాపితం చేసి ఉంటాడా? (తోలుతిత్తిలో ఉన్న నీళ్లు చల్లి నల్లటిగింజలు ఎగురవేస్తూ) పిల్లల్లారా! గంతులు వేస్తూ ధనం ఎక్కడ దాచాడో వచ్చి చెప్పండి. (నిరాశతో) చేతులకు తడి కావటం తప్ప (లాభంలేదని మూకాభినయం చేసి)
మైత్రేయుడు : చారుదత్తా! ఎవడో దొంగ!
శర్విలకుడు : (వెనుకడుగు వేసి) ఆఁ.
మైత్రేయుడు : కన్నం త్రవ్వుతున్నాడు. నగలపాత్ర నీవు పుచ్చుకో (గుర్... గుర్... గుర్...)
శర్వీలకుడు : నగలపాత్ర! పరమ దరిద్రులయింట ఏమి బాముకుందా మని వచ్చాడో వీడు అని నన్ను పరిహసిస్తున్నాడా? (దగ్గిరకుపోయి) లేదు, కేవలం పలవరింత!
మైత్రేయుడు : (పాత్రిక అందిస్తూ) గంగ ఒడ్డున కపిలగోవును చంపినంత పుచ్చుకోకపోతే. పుచ్చుకో!
శర్విలకుడు : (అందుకోబోయి) అయ్యో! నా బ్రాహ్మణ కులానికి ఎంత తీరని కళంకం!
మైత్రేయుడు : మిత్రమా! ఇంకా అందుకోవేం? కామదేవుని గోపురకలశాన్ని తన్నినంత ఒట్టు - (అందిస్తాడు).
శర్వీలకుడు : (అందుకుంటాడు).
మైత్రేయుడు : మిత్రమా! నీ చేతులింత చల్లగా ఉన్నవేం?
శర్విలకుడు : ఆఁ- ఒట్టు పెట్టావని పుచ్చుకున్నాను.
మైత్రేయుడు : ఇక గుండెమీద చేయి వేసుకొని శుభ్రంగా నిద్రపోతాను.
శర్వీలకుడు : నూరేండ్లు! - (ముందుకు వచ్చి చురకత్తిలాగి జాగరూకతతో నిష్క్రమిస్తాడు. ఒక కొద్దికాలం నిశ్శబ్దం).
రదనిక : (ఉద్వేగంతో ప్రవేశించి) అమ్మయ్యో! దొంగ! దొంగ!! - బాబయ్యా కన్నం వేసి పారిపోతున్నాడు!
—————————————————————————
135