Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైత్రేయుడు : ప్రతిరాత్రీ ఇది పక్కలో ఉంటుంటే నాబోటి ఘోటక బ్రహ్మచారికే వేశ్యలకు సంబంధించిన విచిత్రపుపీడ కలలు వస్తున్నవోయ్! ఏ తొత్తుకొడుకైనా దీన్ని దొంగిలిస్తే ఎంత బాగుంటుంది! ఇంత ఉజ్జయినీ పట్టణంలో అంత మొగవాడే లేకపోయినాడా! - ఈ దిక్కు మాలింది నా నిద్ర పాడుచేస్తున్నది. అయినా తప్పదు. "శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం!" (అసంతృప్తితో గునుస్తూ ముసుగు పెట్టుకొంటాడు)

చారుదత్తుడు : ఆహా! రేఖిలుడు ఎంత చక్కగా రాగాలాపన చేశాడు. ఎంత స్ఫుటంగా, లలితంగా, మనోహరంగా, భావాన్వితంగా ఉంది అతని పాట యువనిక చాటున ఉండి పాడినట్లయితే నిజంగా నేనే ఎవరో యువతి పాడుతున్నదని భ్రాంతి పడేవాణ్ణి. మనోహరమైన గాత్రం! గొంతులో ఎంత చక్కని జీర!!

మైత్రేయుడు : జీరకాదు, బూర! బీరపాదుదగ్గిర ఎవడ్రా ఆ వాజమ్మ!

చారుదత్తుడు : మైత్రేయా! నీకింకా నిద్రపట్టలేదా?

మైత్రేయుడు : (మొగంమీద ముసుగు తొలిగించి) ఆఁ కలవరిస్తున్నానా? ఏనుగులను కట్టించి లాగినా ఈతడవ కంటిరెప్పలు విడిపడవు. (గుర్... గుర్... గుర్...)

చారుదత్తుడు : (నిశ్చలకంఠంతో) ఈశుష్కమైన జగత్తులో రేఖిలుడి గానమాధుర్యానికి (వసంతసేన చిత్రపటం చూస్తూ) పోల్చదగ్గ వస్తువేమున్నది, ఒక్క మా వసంతసేన సౌందర్యం తప్ప? రేఖిలా!

(*) మనసుకైనా అందుకోలేని సుకుమార విపంచీ కలస్వనాన్ని పంచ భూతాలుగా గ్రహించి మా కళ్ళకు కట్టేటట్లు ఒక మనోహరస్వర్గాన్ని సృజించావు. అపురూపమైన నీ అమృతశక్తికి ఇవే మా ప్రమాణాలు.

మైత్రేయా! (వాతాయనంవైపు నడిచి) కుముదినీ ప్రియల కుపితారుణ నేత్రరక్తిమలకు వెరచి చంద్ర భగవానుడు ఆకాశసౌధం మీదికి దిగివస్తున్నాడు. ప్రియా వసంతసేనా! నా జీవితాకాశంమీద నిలిచి లాస్యం చేసి నీవు చిరు వెన్నెలలు కురిసే దెప్పుడో కదా! (మందయానంతో నిమీలితనేత్రాలతో నిద్రను సూచిస్తూ పర్యంకాన్ని చేరుకొని దీపం తగ్గించి మంచం మీద మేనువాలుస్తాడు)

మైత్రేయుడు : (గట్టిగా గుర్రు పెడుతుంటాడు)

—————————————————————————

134

వావిలాల సోమయాజులు సాహిత్యం-2