శకారుడు : (మాట్లాడడు).
మైత్రేయుడు : అమ్మాయీ! ఈ వెధవ ఏం చేశాడు?
రదనిక : చేయి పట్టుకొని -
మైత్రేయుడు : ఆఁ (దుడ్డుకర్ర పైకెత్తుతాడు)
కుంభీలకుడు : (అడ్డం వచ్చి) శాంతించమంటావా? అమ్మాయీ నీవు ఇంట్లోకి వెళ్ళు. ఇదంతా చారుదత్తుడికి తెలియనీయకు.
రదనిక : (సరేనన్నట్లు తలపంకించి నిష్క్రమిస్తుంది)
మైత్రేయుడు : ఒరేయ్! ఎవర్రా మీరు?
కుంభీలకుడు : అయ్యా! ఆప్తజన మనుకొని మా మిత్రుడు భ్రాంతిపడ్డాడు క్షమించండి!
మైత్రేయుడు : ఓరి చిత్తకార్తె వెధవల్లారా! సిగ్గు బొగ్గు లేకుండా రాచబాటల్లో పరిహాసాలు ఆడుతున్నారా? ఇది చారుదత్తుడి గృహవీథి అని మీకు తెలియదూ- కదలరేం? - ఉఁ- 'ఎత్తేఅగ్నే' చెపుతారా లేదా? లేకపోతే 'ఛిదంతాం' చేసి పంపుతాను.
కుంభీలకుడు : బాబయ్యా! తక్షణం వెళ్ళిపోతాం.
మైత్రేయుడు : ఉఁ!
శకారుడు : లొట్టిపిట్ట మోకాలిలా బట్టతలా వీడూ వీణ్ణి క్షమాపణ అడుగుతావేం బావా! ఈ బాపనయ్య ఏమో మహామండిపడుతున్నాడు? మన సంగతి కొంచెంచెప్పు -
కుంభీలకుడు : సమస్త సద్గుణాలున్న చారుదత్తుడి మిత్రుడు ఆయన. ఎంతైనా మండిపడవచ్చు. నీవూరుకో!
శకారుడు : గుణాలన్నీ మనబొక్కసంలో ఉంటే దరిద్ర చారుదత్తుడికి ఇంకా గుణాలెక్కడివోయ్!
కుంభీలకుడు : అధిక ప్రసంగం కట్టిపెట్టి మనం వెళ్ళిపోదాం పద.
శకారుడు : వసంతసేనను విడిచిపెట్టే!
కుంభీలకుడు : నీకింక వసంతసేన... ఆమె నీది కాదు. ఆమె చారుదత్తుడి ఇంట్లో చేరింది.
—————————————————————————
125