Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(కామదేవునిముందు సకరుణంగా మోకరిల్లి!) ప్రభూ! నాబ్రతుకును ఎన్నాళ్ళు ఈ అడవిలో కాచిన వెన్నెలను చేయదలచుకున్నావు. నా పవిత్ర ప్రేమలతకు ప్రపంచములో ఆలంబనమే లేదా? అనుగ్రహించి నీవిచ్చిన ఈ అందచందాలు ఆటపాటలూ అర్ధోన్మత్తులైన ఈ పామరపల్లవుల పాలు చేయవలసిందేనా? రసిక దాంపత్య ప్రణయానికి ఈ దాసి నోచుకోలేదా? ఊహాగానాలతో ఉజ్వలానంద రసపిపాస తీర్చుకోలేను స్వామీ! నా స్వప్నసౌఖ్యాలకు వాస్తవిక స్థితి రాదా? కనికరించి నా కామితమీడేర్చు ప్రభూ! నీ దయ రానిది ఇక నీ పాదదాసి జీవించలేదు నీకు ఆటలుండవు! - పాటలుండవు!! మదనికా!

(నిస్త్రాణతో లేచి వేదికను సమీపిస్తుంది)

మదనిక: (దగ్గరకు వస్తూ) అక్కా!

వసంతసేన : అమ్మాయీ! ఆర్యచారుదత్తులు ఇందాకనే ఆలయానికి బయలుదేరారంటివే?

మదనిక: అవును. అబద్ద మేముంది!

వసంతసేన : మరి ఏరీ?

మదనిక: (ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్లు నటించి) మైత్రేయులూ ఆర్యులూ రాచబాటలో ఆలయానికి పయనమౌదా మనుకుంటుంటే విని ఆఘమేఘాల మీద వచ్చి నిన్ను పిలుచుకోవచ్చానక్కా!

వసంతసేన : ఈ పాటికి వారు వచ్చి వెళ్ళిపోయి ఉండరు గదా!

మదనిక : ఇంతలోనేనా? మనం అడ్డదారిని కూడా వస్తిమి.

వసంతసేన : ఇంకా వారు వస్తారంటావా?

మదనిక : వస్తారనే నా నమ్మకం. (వసంతసేన ప్రక్కకు చేరి కూర్చుంటూ) అక్కా! ఈ దినం అప్పుడే ఆటచాలించావు.

వసంతసేన : ఎందుకో నాట్యం చేయాలని ఆసక్తే లేదు. ఇదని చెప్పలేకుండా ఉన్నాను. కాసేపు గజ్జె కట్టానో లేదో ఎంత అలసిపోయినానో చూడు. (వేదనపడుతుంటే మదనిక ఉత్తరీయపు కొంగుతో విసురుతుంటుంది) అమ్మాయీ! ఏమైనా సరే, వారు ఏమనుకుంటున్నా సరే, ఈ దినం ఆర్య చారుదత్తులు వస్తే ఆ సంగతి అడిగివేస్తాను. లేకపోతే మనస్సును కలతపెట్టే కోరికను ఎన్నాళ్ళని దాచిపెట్టేది?

————————————————————

114

వావిలాల సోమయాజులు సాహిత్యం-2