మదనిక : (సాలోచనగా) ముందు నీవే బయటపడితే చులకనైపోతావేమో!
వసంతసేన : అల్పుల విషయంలో అంతే కావచ్చును. కానీ ఆర్యుల విషయంలో సంకోచించ నవసరంలేదనుకుంటున్నా.
మదనిక : అయినా, అక్కా! నీ పవిత్రప్రేమకు ఈ ప్రక్కదారులెందుకు? వారు వస్తున్నారేమో!
వసంతసేన: అమ్మాయీ! ఆయనకు విధ్యుక్తంగా నిలవబడి ప్రణామం చేయగలుగుతానా?
మదనిక : (సకరుణంగా) అక్కా! నీ వింత బేల వనుకోలేదు. (కొంతదూరం ముందుకు నడిచి) అరుగో! ఆర్యులూ మైత్రేయులూ!!
వసంతసేన : అమ్మాయీ! నాకేమిటో అర్థంగాని భయమేస్తున్నది. మదనిక : భయమెందుకు? రాగానే నిలవబడి నమస్కారం చెయ్యి! చిరునవ్వుతో చిత్తాన్ని ఆకర్షించు.
వసంతసేన : ఆ పని నాకు సాధ్యమౌతుందా?
మదనిక : అక్కా! ఆయనమటుకు అన్నీ ఉడిగిపోయిన అద్వైతికాడుగా! నీవు కాకలు తీరిన కళోపాసివీ దగ్గరికి వచ్చేస్తున్నారు. సిద్ధపడు! నేను వెనుక ప్రక్కగా నిలవబడతాను.
(బయలుదేరబోతుంది)
వసంతసేన : నేను ఒంటరిగా ఉండలేను. అయినా వారి ఆరాధనకు అడ్డువస్తానేమో! నేనూ ఆ విగ్రహం వెనకనుంచీ వారి సౌందర్యాన్ని కళ్లార చూచి ఆనందించి తరువాత వచ్చి నమస్కరిస్తాను. (పూజాపాత్రిక వేదికమీదనే ఉంచి ఇద్దరూ విగ్రహాలవెనుకకు వెళ్ళిపోతారు)
(ప్రవేశము - మైత్రేయుడు, చారుదత్తుడు)
చారుదత్తుడు : మైత్రేయా! ఎంత చల్లనిస్వామి!! ఒక నమస్కారం చేసివద్దామా!
మైత్రేయుడు : (క్రోధముతో) పంచబాణాలు మనమీద పడేయటానికేనా? చాలు చాల్లే మొక్కటానికి కోటాను కోట్ల దేవతలుంటే దొరక్క దొరక్క నీకు బలే దేవుడు దొరికాడులేవోయ్!! తార్పుగత్తెలదొర!! (వేదికమీద చతికిల పడుతూ) నేనిక్కడ కూర్చుని
————————————————————————
115