Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఒకటి మించి సొగసును రె
ట్టించుచుండు. రాజఠీవి,
కవిరాజుల ఠీవి, కథక
చక్రవర్తిఠీవి వెడల
గ్రక్కునట్టి మీసమ్ములు
ముఖమున కుంకుమబిందువు
ముమ్మూర్తుల లలితా తాం
డవ మెనర్చు చేతికర్ర
మహాస్వర్ణ ఘంటాలం
కృత్యములైన సింహతలా
టాలు, బుజము పైన సొగసు
కొంగు రానిచ్చిన రెండి
ప్రక్కనుండి పోవనిచ్చి
ఎడమచంక నదిమిపట్టు
ఉత్తరీయమును జలతా
రంచుదాన్ని, బెత్తెడు జల
తారంచుల సేలం దో
వతికుచ్చెళ్లను జీరా
డగను కట్టి పాంకోళ్లతో
ముందుదెసకు వీథిలోన
వెనుక శిష్యతండము వె
న్నంటిరాగ మెడ అందలి
జపమాలయు, బంగారపు
పతకమ్ములు అల్లాడగ
విచ్చలవిడి తిరుగునట్టి
పుంగవ[1] మన్నట్లు పోవు
దాసుగారిమూర్తి ఎంత
పౌరుషవంత మ్మయినను
ఆలోచింపంగ “అమ్మ”
మూర్తి గానె గోచరించు
టద్భుతమ్ము! మీసా లీ
భావన కేమాత్రమ్మును
అడ్డురావు అలంకార
ముల పొందుతు ముస్తాబవ
టమ్ములోన ఎచట లేని
శ్రద్ధనొందు దాసుగారి
వైఖరి తిలకింతు మేని
సత్యముగా ఈయన ఆ
శారదయే అనిపింతురు
అనిపించుట తోటి ఏల?
సత్యముగా పుంభావ స
రస్వతియే లేకపోతె
సారస్వత గాంధర్వ క
ళాప్రావీణ్యాలు ఎలా
వారికి లభియించేవి?
ఓ నారాయణదాసా!
మిమ్ము గూర్చి కవిచంద్రుడు
దివాకర్ల రామమూర్తి
వక్కణ ఇల్లా నడిచెను.

37.  ఓ నారాయణభట్ట!
ఆదిభట్ట! మహాభట్ట
భగవంతుని సర్వజనుల
హృదయాలలో ప్రతిష్ఠింప
జేసినట్టి యత్నమె మీ
మనుగడగా సాగినట్టి
మహాభాగులయ్య మీరు
ఆంధ్రజాతి అంతే కాదు
భరతజాతి, కలకాలం

  1. పుంగవము = ఎద్దు

________________________________________________________________________________

824

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1