పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంతర్యం

మహా విద్వత్కవీంద్రులైన బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులు గారు రచించిన ఈ “కామాయని” ఆంధ్రానువాద కావ్యం - ఒక వైదిక పారిజాతం, ఒక పౌరాణిక గాథారత్నం. ఒక ఐతిహాసిక భ్రమర విన్యాసం, ఒక కాల్పనిక ఊహా సౌందర్య శిల్పం!

మహాకవి జయశంకర్ ప్రసాద్ ప్రణీతమైన హిందీ “కామాయని” - గర్భిత మహాకావ్యం. ధర్మ సమ్మితమైన కామాన్ని రసవంతంగా వర్ణించే కావ్య కళా ఖండిక. అది తుల్య స్త్రీ, పురుషాధికార సంపన్నులైన శ్రద్ధా మనువుల ఇద్ద చరిత్ర. ఇందులోని దైవీయ, సౌర, భౌమ, శక్తుల అంతర్యామ సంగమం - ఒక మహాశ్చర్యకర విశేషం!

ఇటువంటి మహత్తర కావ్యానువాదానికి కేవలం శబ్దగత పరిజ్ఞానం చాలదు. భాషాగత విశేషపరిచయం చాలదు. అంతర్గత భావనా వైశిష్ట్య మర్మజ్ఞత కావాలి గాఢమైన శ్రద్ధ కావాలి, ప్రజ్ఞాపాటవం కావాలి, నాన్యతో దర్శనీయమైన సామర్థ్యం కావాలి తాత్వికమైన రహస్యాన్వేషణ కావాలి. ఇన్ని శక్తుల ఏకీకరణ రూపం శ్రీ సోమయాజులు గారు. సోమయాజులు గారివంటి వారు తప్ప ఇతరులిటువంటి అనువాదాలు చేయలేరు.

ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో భావకవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే నవ్యసాహిత్యం నడుస్తున్న రోజుల్లో భావకవిత్వం - విపులంగా గానీ, సుదీర్ఘంగా గానీ, కథా కథనాత్మకంగా గానీ, ప్రాబంధికంగా గానీ లేదు. ముక్తక ప్రాయంగా ఖండ కావ్య సదృశంగా ఉండేది. అది నిజంగా ఒక లోపం. ఆలోపం శ్రీ వావిలాలవారిని చాలా కలవరపెట్టింది, స్పందింపజేసింది. ఆ స్పందన వారి దృష్టిని జయశంకర్ ప్రసాద్ “కామాయని” మీదికి ప్రసరింపజేసింది. భావుకతా బహురస పరిశోభితం, నవ్యాతి నవ్యమైన ఆ కావ్యం వావిలాల వారి హృదయాన్ని ఆకర్షించింది. ఆయన మహా కవిత్వానువాద దీక్షావిధి ఒక తపస్వి అయ్యారు. ఆ తపఃఫలమే ఈ ఆంధ్ర “కామాయని”. నవ్యతా ప్రియులైన తెలుగువారి కిదొక అక్షర వరం! ఒక అవ్యయ స్వరం.

______________________________________________________________________________________

ఆంధ్ర కామాయని

461