పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ఆంధ్రకామాయని రచనకు వావిలాల వారికి సుమారు సంవత్సరన్నర పట్టింది. తర్వాత 1964-67 లలో ఇది "స్రవంతి" పత్రికలో ధారావాహికంగా ప్రచురింప బడింది. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ యిలా యీ పుస్తక రూపంలో..! ఇది వావిలాల వారి ఆత్మాభిమానానికి, రాజసప్రవృత్తికి తార్కాణం!

ఈ కావ్యంలో చింత, ఆశ, శ్రద్ధ, కామము, వాసన, లజ్జ, కర్మ, ఈర్ష్య, ఇడ, స్వప్నము, సంఘర్షణము, నిర్వేదము, దర్శనము, రహస్యము, ఆనందము, అనే 15 శీర్షికలతో విభాగా లున్నాయి. 'ఇడ' అన్వేషణారూపంలో ఉంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఈ పేర్లన్నీ మానసిక చిత్త వృత్తులకు పెట్టినవే అని తెలియకపోదు. మనసు ఒక అవ్యక్త మధుర జీవన గానం! అందుకే ఈ కావ్యాన్ని వావిలాల వారు “తేటగీతి”లో నడిపారు. మధ్యలో 'శ్రద్ధ' ఆలపించిన “రగడ" కూడా మధుర గేయమే. - భారతీయ వైదిక వాఙ్మయంలో 1. స్వాయంభువుడు, 2. స్వారోచిషుడు 3. ఉత్తముడు, 4. తామసుడు 5. రైవతుడు 6. చాక్షుషుడు 7. వైవస్వతుడు 8. సూర్య సావర్ణి 9. దక్ష సావర్ణి 10. బ్రహ్మ సావర్ణి 11. ధర్మ సావర్ణి 12. రుద్ర సావర్ణి 13. దేవ సావర్ణి 14. ఇంద్ర సావర్ణి అని 14 మంది మనువులున్నారు.

మన స్థానీయమైన ఈ చతుర్దశ మనుచరిత్రల్ని ఆధి భౌతిక, ఆధి దైవిక ఆధ్యాత్మిక సంస్థాగతం గానూ, జీవేశ్వర వ్యూహాత్మకంగానూ తెలుసుకోవలసి ఉంది. ఆ “మను” వంశ “ప్రవర” ఒకానొక తాత్విక భావ “వరూధిని”!

అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవ విశేషాన్ని ప్రబంధీకరించాడు. శ్రీ వావిలాల వారు ఈ కావ్యం ద్వారా "వైవస్వత" మను దర్శనం చేయించారు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం కదా!

గీతాచార్యుడు జ్ఞానయోగంలో -

"ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్” అని ఎవరిని కాలాత్మకంగా గుర్తుచేసుకున్నాడో-ఆ వివస్వతుని కుమారుడే ఈ కావ్య కథానాయకుడు వైవస్వతుడు. ఇతడు “శ్రద్ధా” న్వితుడు. ఇతనిని గూర్చి ప్రత్యేక 'శ్రద్ధ' తో అధ్యయనం చేస్తేనే గానీ తర్వాత వచ్చే సూర్య, దక్ష, బ్రహ్మ, ధర్మ, రుద్ర, దేవ, ఇంద్ర బలాలు అర్థం కావు. అవన్నీ అంతరంగ తరంగాలు! ఈ మనువుల అంతరాలే మన్వంతరాలు! ఈవిషయాల్ని పురాణాలు విభిన్న కోణాల నుండి నిరూపించాయి. ఆ అధ్యయనం ధర్మ కామన! ఇది కామాయనీ మహదక్షర ఖేలన!

________________________________________________________________________________________

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1