పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాన్నగారికి ఈ గ్రంథ రచనాకాలంలో చేదోడువాదోడుగా ఉన్న సుప్రసిద్ధ హిందీ విద్వాంసులు శ్రీ చావలి కోటీశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు. వారి తోడ్పాటును నాన్నగారిలా ప్రశంసించారు.

తొలి నారాయణభట్టు నన్నయకు సద్యుక్తిన్ నిగూఢార్థముల్ చెలిమిన్ దెల్పిన రీతి దెల్పి, యట నాచే నాంధ్ర కామాయనీ కలహంసన్ సృజియింపఁజేసిన లసద్గణ్యుండు, పుణ్యుండు చా వలి కోటీశ్వరరాయ విజ్ఞుని మహాప్రౌఢిన్ ప్రశంసించెదన్.

ఈ కావ్యానికి సుప్రసిద్ధ కవివర్యులు డాక్టర్ శ్రీ ఆచార్య తిరుమల గారు 'ఆంతర్యం' అందించారు.

శ్రీ ఆచార్య భీమసేన్ 'నిర్మల్ గారు, (ఎమిరిటన్ ప్రొఫెసర్, హిందీ శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు) 'ప్రశంస' సంతరించారు. ఈ ఇరువురు పెద్దలకు మా నమస్కృతులు.

పాతిక సంవత్సరాల నుండి 'ఆంధ్రకామాయని' వ్రాతప్రతిని నాన్నగారితో పాటు పఠించి, అక్కడక్కడ కొన్ని మార్పులు, చేర్పులు సూచించి అక్షరసాలిత్యాలను సవరించి నాన్నగారికి మిక్కిలి తోడ్పడిన సుప్రసిద్ధ కవివర్యులు శ్రీ అన్నపర్తి సీతారామాంజనేయులు గారికి మా నమోవాకాలు.

సుప్రసిద్ధ చిత్రకారులు, నాన్నగారికి శిష్యులు శ్రీ మారేమండ శ్రీనివాసరావు గారు అడిగినదే తడవుగా ఈ గ్రంథాన్ని అందమైన ముఖచిత్రంతో అలంకరించారు. వారికి మా అభినందనలు.

ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రించి ఇచ్చిన 'వెల్కమ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు' వారికి మా సాధువాదములు.

నాన్నగారి ఈ కృషిలో ఇంకా ఎందరో విద్వద్వరేణ్యులు కవి తల్లజులు సహకరించి ఉండవచ్చును. వారందరినీ గూర్చి తెలియని మా అజ్ఞానాన్ని మన్నించ ప్రార్ధన. ఈ కృషిలో నాన్నగారికి సహకరించిన ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు.

ఇట్లు

వావిలాల బృహస్పతి

వావిలాల ఉమాపతి

వావిలాల గౌరీపతి

________________________________________________________________________________________

460

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1